Sunita Williams And Butch Wilmore Can Return to Earth soon | ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకు తిరిగి రానున్నారు. 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వీరిని భూమి మీదకు తిరిగి తీసుకొచ్చేందుకు అవకాశం దొరికింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA), స్పేస్ ఎక్స్ ప్రయోగించిన క్రూటెన్ మిషన్ లో పురోగతి లభించింది. క్రూటెన్ మిషన్ ఆదివారం ఉదయం 9:37 గంటలకి ఐ ఎస్ ఎస్ తో విజయవంతంగా అనుసంధానమైంది. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ (SpaceX) వీడియో ద్వారా షేర్ చేసింది.
తాజాగా అక్కడికి వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ లో ఉన్న సునీతా విలియమ్స్, విల్మోర్ స్థానంలో పనిచేయనున్నారు. అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. క్రూ-10 మిషన్‌లో భాగంగా స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఇందులో అమెరికాకు చెందిన నికోల్ అయర్స్, ఆన్నె మెక్‌క్లెయిన్, జపాన్ ఆస్ట్రోనాట్ టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్‌లు ఆదివారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోగా.. ఐఎస్ఎస్ లో ఉన్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వారికి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వ్యోమగాముల సంతోషాన్ని చూశాం.
క్రూ 10 వ్యోమనౌకకి చెందిన కమాండర్ మెక్‌క్లైన్ మాట్లాడుతూ.. దాదాపు 28 గంటలు ప్రయాణించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నామని తెలిపారు. ఐఎస్ఎస్ చేరుకున్నాక విండో నుంచి చూసిన వ్యోమగాములు ఎంతగానో ఆనందించారు. సేఫ్ గా ల్యాండింగ్ చేయడానికి సహకరించిన గ్రౌండ్ కంట్రోల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్‌పెడిషన్ 72లో భాగం అయినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని జపాన్‌కు చెందిన టకుయా ఒనిషి అన్నారు.
విలియమ్స్, విల్మోర్ త్వరలో భూమి మీదకు..
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్ 2024లో స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. కేవలం 10 రోజుల పాటు అక్కడ ఉండి, అనంతరం తిరిగి రావాలని నాసా శాస్త్రవేత్తలు భావించారు. కానీ బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో వారి తిరుగు ప్రయాణం పలుమార్లు వాయిదా పడింది. సాంకేతిక సమస్యలతో వ్యోమగాములు గత ఏడాది జూన్ నుంచి ISSలో చిక్కుకుపోయారు. ప్రస్తుతం అమెరికా సానా, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఆపరేషన్ క్రూ 10 మిషన్ ద్వారా ఐఎస్ఎస్ లో చిక్కుకున్న వ్యోమగాములు మార్చి 19 వరకు భూమి మీదకు వచ్చే అవకాశం ఉంది. సునీతా విలియమ్స్ అండ్ టీం ఐఎస్ఎస్ నుంచే పండుగల సమయంలో ఇంటరాక్ట్ అవుతున్నారు. అక్కడి విశేషాలను వీలు చిక్కినప్పుడల్లా షేర్ చేసుకున్నారు.