South Korean President Yoon Arrested: దక్షిణ కొరియా (South Korea) అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను (Yoon Suk Yeol) అధికారులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. దేశంలో అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించిన ఆయన చిక్కులు కొనితెచ్చుకున్నారు. ఇప్పటికే అభిశంసనకు గురి కాగా.. 'మార్షల్ లా' విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను యోల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున వందలమంది దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకోగా.. తొలుత అధ్యక్ష భద్రతా దళాలు వీరిని అడ్డుకున్నాయి. కొంతసేపు ప్రతిష్టంభన నెలకొన్న తర్వాత దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. గతంలో యోల్‌ను అరెస్ట్ చేసేందుకు యత్నించగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు.

Continues below advertisement






ఎమర్జెన్సీ మార్షల్ లా


ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. గతేడాది డిసెంబరులో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ 'ఎమర్జెన్సీ మార్షల్ లా' విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వెను వెంటనే తన ప్రకటనను విరమించుకున్నారు. అయితే, అధ్యక్షుడి నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన అక్కడి ప్రతిపక్షాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో 'మార్షల్ లా' అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్ ప్రకటించారు.


అభిశంసన తీర్మానం


దేశంలో 'మార్షల్ లా' ఉత్తర్వులు జారీ చేసి సంక్షోభంలోకి నెట్టినందుకు యూన్ సుక్ యేల్‌కు వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీలో విపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానానికి 204 మంది అనుకూలంగా ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఆయన అధ్యక్ష అధికారాలను కోల్పోయారు. మరోవైపు, అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో దీనిపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. వీటికి ఆయన స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించగా.. అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. దీంతో బుధవారం తెల్లవారుజామున అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నారు.


Also Read: Gold Mine: దక్షిణాఫ్రికాలో ఘోర విషాదం - బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు మృతి, ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్