ప్రపంచంలో అనేక దేశాల అధ్యక్షులు సారీ చెబుతున్నారు. ఎవరికో కాదు. తమ ప్రజలకే చెబుతున్నారు. ఎందుకంటే.. కరోనాను సమర్థంగా డీల్ చేయలేకపోయామని.. ప్రజలు చనిపోయారని... అందుకే క్షమాపణలు కోరుతున్నామని చెబుతున్నారు. ఆస్ట్రేలియాప్రధానమంత్రి ఈ విషయంలో ఎమోషనల్ అయ్యారు. ఐయామ్ సారీ అంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పోలాండ్, తైవాన్ ప్రెసిడెంట్లు కూడా అదే చేశారు. పదవిలో ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సారీ చెప్పారు. ఇక కరోనా వ్యవహారంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు ఎదుర్కొన్న బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్స్ నారో కూడా అదే తరహాలో క్షమాపణలు చెప్పారు.
అధ్యక్షులు చేస్తున్నఈ క్షమాపణల ప్రకటనలు... అంతర్జాతీయంగా హెడ్ లైన్స్ అవుతున్నాయి. ఇంత నిజాయితీగా వారు ప్రజలకు సారీ చెబుతూండటం.. చాలా మందికి నచ్చుతోంది. కానీ.. ఇండియాలో మాత్రం.. వారిపై జాలిగా చూస్తున్నారు. వారంతా ఇండియాను చూసి నేర్చుకోకుండా తప్పు చేశారని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత బాగా కరోనాను నియంత్రించిన దేశం భారత్. ఎంతగా అంటే... ఒక్కటంటే.. ఒక్క ఆక్సీజన్ అందని మరణం ఇండియాలో చోటు చేసుకోలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. పార్లమెంట్‌లోనే గొప్ప తనాన్ని ఆవిష్కరించింది.
అలాగే.. ప్రపంచం మొత్తం కరోనా కట్టడి విషయంలో భారత్ వైపు చూసిందని మోడీ చాలా సార్లు స్వయం సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఇక కోవిన్ యాప్ గురించి.. ఓ పెద్ద వర్క్ షాప్‌ను ప్రపంచానికి అవగాహన కల్పించడానికి నిర్వహించారు కూడా. ఆ కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి ఇప్పటికీ.. వ్యాక్సిన్ అందకపోవడం పెద్ద విషయం కాదు . ఆ యాప్ ఎన్నో సార్లు క్రాష్అయినా లెక్కలో లేదు. కానీ.. యాప్ మాత్రం.. ప్రపంచ అద్భుతం. ఇలాంటి యాప్ గురించి.. ఇండియా నుంచి ముందే తెలుసుకునే ప్రయత్నాన్ని ఆ దేశాధ్యక్షులు చేయలేదు.
ఇండియా ప్రభుత్వం కరోనా కట్టడికి ఏం చేసిందో.. ఎలా చేసిందో.. కాస్త చూసినట్లయితే.. ఆ విధంగా సారీ చెప్పే పరిస్థితి వచ్చి ఉండేది కాకపోవచ్చునని కొంత మంది సీరియస్‌గానే చెబుతున్నారు. వినే వాళ్లకు అది కామెడీగా ఉండొచ్చు. కానీ.. కరోనాను కట్టడి చేయలేకపోయినా.. ప్రజల్ని చప్పట్లు కొట్టించడం.. దీపాలు వెలిగించడం వంటి ఎమోషన్లు అయినా వారు నేర్చుకుని ఉండేవారు. టీకాలు ప్రజలకు పెద్దగా పంపిణీ చేయకపోయినా బాహుబలి గురించి ధైర్యం మాట్లాడగలిగేవాళ్లు. అన్నింటి కన్నా ముఖ్యంగా కళ్ల ముందు జరిగిన దాన్ని కూడా.. జరగలేదని చెప్పడం.. ప్రచారం చేయడం నేర్చుకుని ఉండేవారు. అప్పుడు.. వారు ఎవరికీ సారీ చెప్పాల్సిన పనే ఉండేది కాదు. అందుకే.. వారంతా ఇండియా వైపు చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది సెటైర్ కాదు.. సీరియస్సే..!