PLASTIC EATING FUNGI : జర్మనీలోని లేక్ స్టెచ్‌లిన్‌లో ప్లాస్టిక్‌ను తినగల ఫంగస్ బ్యాక్టిరియాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్లాస్టిక్ కాలుష్య సమస్యను పరిష్కరించడంలో విప్లవాత్మకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫంగస్ వివిధ రకాల ప్లాస్టిక్‌లను విచ్ఛిన్నం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయని చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యం అత్యంత తీవ్రమైన పర్యావరణ సమస్యలలో ఒకటిగా మారింది. ప్రతి సంవత్సరం సుమారు 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయి. పాలీథిలిన్ (PE) , లీయురేథేన్ (PU) వంటి బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్‌లు సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. వన్యప్రాణులకు హాని కలిగిస్తున్నాయి. సాంప్రదాయ ప్లాస్టిక్‌లు భూమిలో కలిసిపోవడానికి శతాబ్దాల సమయం పడుతుంది, ఇది ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.
జర్మనీలోని లేక్ స్టెచ్‌లిన్‌లో శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం కొన్ని శిలీంధ్ర జాతులను గుర్తించారు. ఈ బ్యాక్టిరియా శిలీంధ్రాలు వివిధ పర్యావరణ పరిస్థితులలో వృద్ధి చెందగలవు . బహుళ రకాల ప్లాస్టిక్‌లను విచ్ఛిన్నం చేయగల సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఇతర జీవుల కంటేఎక్కువ ప్రయోజనాన్ని మానవాళికి కలిగిస్తాయని అంచనా వేస్తున్నారు. 18 శిలీంధ్ర జాతులలో నాలుగు జాతులు ప్లాస్టిక్‌లను, ముఖ్యంగా పాలీయురేథేన్‌ను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయగలవని కనిపెట్టారు. ప్లాస్టిక్ బ్యాగ్‌లు, ప్యాకేజింగ్‌లో ఉపయోగించే ప్లాస్టిక్ విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ శిలీంధ్రాల ఎంజైమ్ యాక్టివిటీ ఉష్ణోగ్రత, సూక్ష్మపోషకాలు వంటి బాహ్య పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇది వాటిని సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు వంటి వాటిలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ఫంగస్ బ్యాక్టిరియాను వ్యర్థ నీటి శుద్ధి కర్మాగారాలు లేదా ఇతర నియంత్రిత పరిస్థితులలో ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలుచెబుతున్నారు. ఇవి సాంప్రదాయ రీసైక్లింగ్ పద్ధతులు సమర్థవంతంగా పనిచేయని ప్రాంతాలలో ఉపయోగకరంగా ఉంటాయని గుర్తించారు. అయితే ఈ పరిశోధనా ఫలితాలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. పెద్ద ఎత్తున వాణిజ్య అనువర్తనం కోసం మరింత పరిశోధన అవసరమని.. ఇందులో ఈ శిలీంధ్రాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పర్యావరణంపై వాటి ప్రభావాల గురించి పూర్తి స్థాయిలో విశ్లేషిచాల్సి ఉందని పరిశోధకులు అంటున్నారు.
ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడం, రీసైక్లింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం, ప్రజలలో అవగాహన కల్పించడం వంటి బహుముఖ విధానాలతో కలిపి, ఈ శిలీంధ్రాలు భవిష్యత్‌లో ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణలో ఒక కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ ప్రపంచ వ్యర్థ నిర్వహణ వ్యవస్థలను మార్చగల సామర్థ్యం కలిగి ఉందని అంచనా వేస్తుననారు.