తీగలు లేకుండా విద్యుత్తును ప్రసరింపజేయడం సాధ్యమయ్యే పనేనా? ఇది దాదాపు అసాధ్యం అనే అనిపిస్తుంది. కానీ, ఇప్పుడు మనం అనుభవిస్తున్న అధునాతన సాంకేతికత, సౌకర్యాలు ఒకప్పుడు అసాధ్యమైనవే. మానవ మేధస్సుతో ఎన్నో పరిశోధనలు, ప్రయత్నాల తర్వాత ఆవిష్కరణలు జరుగుతూ వచ్చాయి. ఒక ప్రయత్నం ఆవిష్కరణగా మారాక కాల క్రమంలో ఎన్నో రూపాంతరాలు చెందుతుంది. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఈ జీవన విధానం కూడా కాలక్రమేణా పరిణామం చెందుతూ వచ్చింది. రాన్రానూ భవిష్యత్తులో మరింతగా మార్పులు చోటు చేసుకొంటూనే ఉంటాయి. అలాగే విద్యుత్తును కూడా తీగల ద్వారా పంపిణీ చేయడం అనేది మొదటి నుంచి వస్తున్న పద్ధతి. కానీ, సిగ్నల్స్ ప్రసరించే తరహాలో వైర్లు లేకుండా కరెంటును పంపడం అనే దానిపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి.


ప్రస్తుతానికి ఈ ఊహ కొంచెం వింతగా అనిపించినా భవిష్యత్తులో సాధారణంగా మారే అవకాశం లేకపోలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న మానవ మేధస్సు వైర్‌ లెస్‌ విద్యుత్‌ విధానాన్ని ఎలాంటి లోపాలు లేకుండా కూడా అందుబాటులోకి తెస్తుందని అంతా నమ్ముతున్నారు. తాజాగా త్వరలోనే ప్రతి ఇంట్లోకి వైర్‌లెస్‌ కరెంట్‌ అందుబాటులోకి వస్తుందని దక్షిణ కొరియాలోని సెజాంగ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెప్తున్నారు. 30 మీటర్ల దూరం వరకూ ఇన్‌ఫ్రారెడ్‌ లైట్ ని వాడి, 400 మిల్లీవాట్ల వైర్‌లెస్‌ విద్యుత్‌తో వారు ఒక ఎల్‌ఈడీ లైట్ ను వెలిగేలా చేశారు. 


ట్రాన్స్‌మీటర్, రిసీవర్‌ ద్వారా వైర్లు లేకుండా ఇక్కడ విద్యుత్‌ సరఫరా జరిగింది. ఈ క్రమంలో ఏదైనా ఆటంకం కలిగితే వెంటనే సిస్టం మొత్తం పవర్‌ సేఫ్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరగబోవని ఆ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ వైర్ లెస్ కరెంట్ విధానం ద్వారా స్మార్ట్‌ హోమ్స్‌, బడా షాపింగ్‌ మాల్స్‌లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IoT) కు విద్యుత్‌ను అందించే అవకాశం ఉందని చెబుతున్నారు.


అయితే, సిగ్నల్స్ విషయంలో.. ట్రాన్స్ మిటర్ తరంగాలను గాలిలోకి ప్రసరింపజేస్తే రిసీవర్ వాటిని అందుకుంటుంది. ఇక్కడ వైర్ లెస్ వ్యవస్థలో తరంగాలు వాతావరణంలోకి అన్ని దిశల్లో విడుదల అవుతున్నాయి. అదే వైర్ లెస్ కరెంటు విషయంలో ఆ సూత్రం పని చేయదు. ఒకవేళ వాతావరణంలోకి కరెంటును ప్రసరింపజేసినా ఎక్కువ విద్యుత్ వృథాగా పోయే అవకాశం ఎక్కువ. వినియోగంలోకి వచ్చే కరెంటు అతి తక్కువ ఉంటుంది. కాబట్టి, అతి సమీపంలో ఉన్న పరికరాలకే ప్రస్తుతానికి వైర్ లెస్ విద్యుత్ సాధ్యమయ్యే అవకాశం ఉంది.


వైర్ లెస్ ఎనర్జీపై టెస్లా విజన్ ఇదీ
దిగ్గజ సంస్థ టెస్లా తన ట్రాన్స్‌ఫార్మర్‌తో విద్యుత్ డోలనాలను (Electrical Oscillations) ప్రేరేపించడం ద్వారా, భూమిని నేచురల్ కండక్టర్‌గా ఉపయోగించడం ద్వారా వైర్‌లెస్ ప్రసారాన్ని సాధించవచ్చని పేర్కొంది. ఈ పెద్ద ప్రాజెక్ట్ కోసం, టెస్లా 1899లో కొలరాడో స్ప్రింగ్స్‌లో ఒక పెద్ద కొత్త ప్రయోగశాలను నిర్మించింది. అక్కడ శక్తివంతమైన 12 మిలియన్ వోల్ట్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసింది. ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఒక తుపాను రోజున, టెస్లా ప్లాంట్ లో ఆసక్తికరమైన ఫలితాలు కనిపించాయని గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ వెబ్ సైట్ లో ప్రచురించింది.