Russia attack on passenger train in Ukraine:   రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత తీవ్రం అవుతోంది.  ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలోని ఒక రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యన్ దళాలు డ్రోన్‌లతో దాడి చేశాయి. ఈ దాడి సమయంలో కీవ్‌కు వెళ్తున్న ఒక ప్రయాణికుల రైలుపై బాంబులు పడ్డాయి. ఫలితంగా, రైల్‌లోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.  

Continues below advertisement

ఈ దాడి శుక్రవారం  మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో జరిగింది. సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న ప్రయాణికుల రైలును రష్యన్ షాహెద్-136 డ్రోన్‌లతో లక్ష్యం చేసుకున్నారు. డ్రోన్‌ల నుండి విడుదలైన బాంబులు రైల్ బోగీలపై పడ్డాయి, మంటలు ఎగిసిపడ్డాయి. స్థానిక మీడియా ప్రకారం, రైల్‌లో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.   మంటలు అరికట్టడానికి ఫైర్ ఇంజిన్‌లు, రెస్క్యూ టీమ్‌లు  ప్రయత్నం  చేశాయి.  గాయపడినవారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది.  వారిని సమీప ఆసుపత్రులకు తరలిసంచారు.   ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఘటనా స్థలంలోని దృశ్యాలను పోస్ట్ చేస్తూ, "సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడులు జరిపింది. ఇందులో అనేక మంది గాయపడ్డారు. సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది.  ఈ ఉన్మాద ప్రవర్తన పట్ల ప్రపంచం నిర్లక్ష్య ధోరణి వహించకూడదు. ప్రతి రోజూ రష్యా ఎంతో మంది ప్రాణాలు తీస్తోంది. యుద్ధం పరిష్కారం కోసం ఐరోపా, అమెరికా నుంచి ఎన్నో ప్రకటనలు వింటున్నాం. కానీ, మాకు మాటల సాయం సరిపోదు. బలమైన చర్యలు అవసరం  అని వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీ ఈ దాడిని "యుద్ధ నేరం"గా పేర్కొని, అంతర్జాతీయ సంఘాలను చర్యలు తీసుకోవాలని కోరారు.   

 2022లో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇటీవల రష్యా తన షాహెద్-136 డ్రోన్‌లను ఉక్రెయిన్‌లోని పౌరుల లక్ష్యాలపై ఎక్కువగా ఉపయోగిస్తోంది. సుమీ ప్రాంతం రష్యా సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, ఇక్కడ దాడులు తరచూ జరుగుతున్నాయి. గత వారంలో ఉక్రెయిన్‌లో 50కి పైగా డ్రోన్ దాడులు జరిగాయి, వీటిలో చాలా శివారులు, పౌరుల లక్ష్యాలు. ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకారం, ఈ దాడుల్లో 100 మందికి పైగా పౌరులు మరణించారు. రష్యా ఈ దాడులను "సైనిక లక్ష్యాలపై" అని చెబుతోంది, కానీ ఉక్రెయిన్ అధికారులు ఇవి "పౌరులపై ఉద్దేశపూర్వక దాడులు" అని ఆరోపిస్తున్నారు. ఐరోపా యూనియన్, అమెరికా వంటి దేశాలు ఈ దాడిని ఖండించాయి.