Russia Ukraine War | వాషింగ్టన్: మూడో ప్రపంచ యుద్ధం రావడం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో మైనింగ్ ఒప్పందానికి ఉక్రెయిన్ నిరాకరించడమే ఆ యుద్ధానికి బీజం వేస్తుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు అమెరికా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ‘రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా నిలువరించకపోతే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. వేలు, లక్షలాది మరణాలు సంభవించకుండా అడ్డుకోవాలని అమెరికా భావిస్తోంది. గత కొన్ని వారాల నుంచి యూరప్ లో, రష్యాలో ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం గమనిస్తుంది. అమెరికా రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దకపోతే కనుక మూడో ప్రపంచ యుద్ధం జరగక తప్పదు అనిపిస్తోంది.
ఉక్రెయిన్ మీద రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాడులు కొనసాగిస్తూనే ఉంటారు. ఈ దేశాల మధ్య యుద్ధం ముగిసేవరకు రష్యా మీద సైతం టారిఫ్ వార్ కొనసాగుతోంది. పరిస్థితి అదుపులోకి వస్తే కనుక రష్యాకు కాస్త ఊరట కలిగిస్తాం. రష్యా, ఉక్రెయిన్ తమ యుద్ధానికి స్వస్తి పలికేందుకు మార్గాలు అన్వేషించాలని ఇరు దేశాలకు సూచించా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది’ అని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో కీలక ప్రకటనను పోస్ట్ చేశారు.
ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, డోనాల్డ్ ట్రంప్ తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉక్రెయిన్ లోని కీవ్ లో మైనింగ్ చేసుకునేందుకు అమెరికాకు అనుమతినిస్తూ అగ్రిమెంట్ చేయాల్సి ఉంది. కానీ తమకు సైనిక సాయంతో పాటు భవిష్యత్తులో రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు అగ్రిమెంట్ చేసుకోవాలని ఉక్రెయిన్ అధినేత పట్టుబట్టారు. ఒకానొక దశలో జెలెన్ స్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు సైనిక పరంగా ఇతరత్రా ఎంతో సహాయం చేసి మద్దతుగా నిలిచిన అమెరికాకు కృతజ్ఞత తెలపడం ఇదేనా అంటూ మండిపడ్డారు.
అమెరికా వైపు నుంచి కాకుండా ఇటు ఉక్రెయిన్ వైపు నుంచి ఆలోచించాలని.. గతంలోనూ ఎంతో మంది అధ్యక్షులు అండగా ఉంటామని చెప్పినా.. కీలక సమయంలో ఉక్రెయిన్ కు సాయం చేయలేదు అన్నారు. అందువల్లే తాను సైనిక సాయంతోపాటు రష్యా దురాక్రమనకు చెక్ పెట్టేందుకు ఉక్రెయిన్ తో ఆ ఒప్పందం చేసుకోవాలని జలెన్ స్కీ పట్టుపట్టడంతో.. డోనాల్డ్ ట్రంప్ మధ్య చర్చలు అభ్యంతరంగా ముగిశాయి. కీవ్ లో అమెరికా మైనింగ్ చేసుకునేందుకు ఒప్పందాలపై సంతకాలు చేయకుండానే ఉక్రెయిన్ అధినేత అమెరికా ఓవల్ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు.