Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌పై భీకర దాడి చేస్తోన్న రష్యా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ, నాటో సభ్య దేశాలు రష్యాకు సవాల్ విసురుతున్నాయని, అణ్యాయుధాలను వినియోగించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని పుతిన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా చీఫ్ ఆఫ్ ద జనరల్ స్టాఫ్ (సీజీఎస్)కు పుతిన్ ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
పశ్చిమ దేశాలు.. రష్యాకు వ్యతిరేకంగా ఆర్థిక చర్యలకు దిగడమే కాకుండా కొన్ని నాటో సభ్య దేశాలు మనకు వ్యతిరేకంగా ఆవేశపూరితంగా ప్రకటనలు చేస్తున్నాయి. కనుక మనం సంసిద్ధంగా ఉండాలి. - వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
భయంభయం
ప్రపచం దేశాలు వారిస్తోన్న ఉక్రెయిన్‌పై దాడి విషయంలో పుతిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అణ్వాయుధాల ప్రకటనతో మరోసారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నారు. ఉక్రెయిన్ విషయంలో ఇతర దేశాలు తలదూరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సైనిక చర్యకు దిగెటప్పుడే పుతిన్ హెచ్చరించారు.
ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడం మా ప్రణాళిక (సైనిక చర్య)లో భాగం కాదు. ఉక్రెయిన్లో సైనికీకరణకు వ్యతిరేకంగా పని చేస్తాం. ఈ విషయంలో కలగజేసుకోవాలని ప్రయత్నించినా.. మా దేశం, మా ప్రజలకు ముప్పు కలిగేలా ఆలోచించినా రష్యా వెనువెంటనే తగిన చర్యలు తీసుకుంటుంది. చరిత్రలో ఎన్నడూ జరగని పరిణామాలకు ఇది దారితీస్తుంది. - వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు