Ban On Facebook: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 26వ రోజు కొనసాగుతుండగా మాస్కో కోర్టు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సంస్థలకు భారీ షాకిచ్చింది. దేశంలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను మాస్కో కోర్టు నిషేధించింది (Moscow Court Bans Facebook and Instagram). ఈ మేరకు సోమవారం తీర్పు వెలవడినట్లు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.
రెచ్చగొట్టే పోస్టులపై కోర్టు ఆగ్రహం..
విద్వేషాన్ని రెచ్చగొట్టే, అతివాద కార్యకలాపాలకు సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయని గుర్తించి మాస్కో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు మెటా సంస్థకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు రష్యాను వీడుతున్న సమయంలో మాస్కో కోర్టు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ (Ban On Facebook and Instagram)లను బ్యాన్ చేయడం ఆ దేశానికి మరో షాక్ అని చెప్పవచ్చు. యుద్ధం నేపథ్యంలో దేశంలో పలు సంస్థలపై నిషేధం ఉంది. ఇది ఆర్థిక సమస్యలను మరింతగా పెంచుతుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
మెటా సంస్థ నిర్ణయాలు, వారికి చెందిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్టులు రష్యా, దేశ ఆర్మీకి వ్యతిరేకంగా ఉన్నాయని ఎఫ్‌ఎస్‌బీ ప్రతినిధి ఇగోర్ కోవెలెవ్‌స్కై మాస్కోలోని ట్వెర్‌స్కోయ్ జిల్లా కోర్టుకు విన్నవించారు. మెటా సంస్థ కార్యకలాపాలను దేశంలో నిషేధించాలని కోరారు. వాదనలు విన్న కోర్టు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను బ్యాన్ చేస్తూ తీర్పిచ్చింది. ఇదివరకే పలు కంపెనీలు రష్యా నుంచి వెళ్లిపోగా, మరో రెండు సోషల్ మీడియా మాద్యమాలు రష్యాలో కొంతకాలం వరకు ఇన్ యాక్టివ్ కానున్నాయి.
పలు దేశాలు ఆంక్షలు, కంపెనీలు గో బ్యాక్..
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఆపకపోవడంతో పలు దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. దేశంలోని అతిపెద్ద డెయిరీ కంపెనీ డానోన్, కోకా-కోలా తన వ్యాపారాన్ని రష్యాలో ఇదివరకే నిలిపివేశాయి. అమెరికన్ షూ కంపెనీ నైక్, స్వీడన్ కు చెందిన హోమ్ ఫర్నిషింగ్ కంపెనీ ఐకియా కూడా రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలను తాత్కాలికంగా బంద్ చేశాయి.
మారియుపోల్ నగరాన్ని ఖాళీ చేయాలని రష్యా ఉక్రెయిన్‌కు అల్టిమేటం జారీ చేసింది. ఉక్రెయిన్ మాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తమ పోరాటం ఆగదని, తమకు సహకరించాలని పలు దేశాలను కోరారు. మరియుపోల్ నగరం దక్షిణ, ఉత్తర ఉక్రెయిన్‌లను కలిపే వంతెనగా మారుతుందని రష్యా భావించి ఈ నగరంలో దాడులను ముమ్మరం చేసింది. ఈ యుద్ధంలో రష్యా సైతం 13000 మంది సైనికుల ప్రాణాలు కోల్పోయిందని ఉక్రెయిన్ చెబుతోంది. ఎన్నో యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్లను కూల్చినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించుకున్నారు.
Also Read: Russia Condom sales : రష్యన్ల బాధ అర్థం చేసుకోవడం కష్టం - వారికి అర్జంట్‌గా కండోమ్స్ కావాలట !
Also Read: మరో సోమాలియాలా శ్రీలంక ! ఆ దేశ పరిస్థితికి ఇవే కారణాలు