Asteroids mining:  అంతరిక్షంలో గనుల తవ్వకం అనేది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితం కాదని, అది భవిష్యత్తులో సాధ్యమేనని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.  మ్యాంత్లీ నోటీసెస్ ఆఫ్ ది రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ అనే మ్యాగజైన్ లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. గ్రహశకలాల నుండి ఖరీదైన లోహాలు ,  నీటిని సేకరించడంపై శాస్త్రవేత్తలు సానుకూల అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. భూమిపై సహజ వనరులు తరిగిపోతున్న తరుణంలో శాస్త్రవేత్తల దృష్టి ఇప్పుడు అంతరిక్షంలోని గ్రహశకలాలపై పడింది. వీటిలో బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలతో పాటు మనుగడకు అత్యంత అవసరమైన  నీరు భారీ నిల్వలు  ఉన్నట్లు తాజా పరిశోధనలు నిర్ధారించాయి. స్పానిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ శాస్త్రవేత్తల బృందం విశ్లేషణ ప్రకారం.. అన్ని గ్రహశకలాలూ గనుల తవ్వకానికి పనికిరావు. ముఖ్యంగా  కార్బనేషియస్ కొండ్రైట్స్  రకానికి చెందిన శకలాలు అత్యంత ఆశాజనకంగా ఉన్నాయని వారు గుర్తించారు.

Continues below advertisement

ఈ పరిశోధనలో తేలిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే.. గ్రహశకలాల నుండి లభించే  నీరు. భూమితో పోలిస్తే  అంతరిక్షంలో నీటి విలువ చాలా ఎక్కువ. దీనిని కేవలం తాగడానికే కాకుండా, హైడ్రోజన్ ,  ఆక్సిజన్‌గా విడగొట్టి రాకెట్ ఇంధనంగా మార్చుకోవచ్చు. దీనివల్ల అంతరిక్ష నౌకలు భూమి నుండి భారీ మొత్తంలో ఇంధనాన్ని మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతరిక్షంలోనే  పెట్రోల్ బంకుల తరహాలో ఇంధనాన్ని నింపుకుని సుదూర గ్రహాల యాత్రలు చేయడం సులభతరం అవుతుంది.

అయితే, ఈ గనుల తవ్వకం అనుకున్నంత సులభం కాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గ్రహశకలాల పై గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉండటం వల్ల అక్కడ యంత్రాలను నిలబెట్టడం,  తవ్వకాలు జరపడం ఒక సవాలుతో కూడుకున్న పని. అలాగే భూమి నుండి లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రహశకలాల వద్దకు చేరుకోవడానికి అయ్యే ఖర్చు, తవ్వి తెచ్చిన లోహాల విలువ కంటే ఎక్కువగా ఉండకూడదు. ప్రస్తుతం  స్టార్‌షిప్ వంటి భారీ రాకెట్ల రాకతో ప్రయోగ ఖర్చులు తగ్గుతుండటం వల్ల ఈ ప్రాజెక్టులు ఆర్థికంగా లాభదాయకంగా మారుతాయని అంచనా వేస్తున్నారు.               

Continues below advertisement

వ్యాపార పరంగానే కాకుండా, భూమికి ముప్పుగా మారే ప్రమాదకర గ్రహశకలాల నుండి వనరులను సేకరించడం ద్వారా వాటి పరిమాణాన్ని తగ్గించవచ్చని, తద్వారా భూమికి రక్షణ కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు.  ఇప్పటికే  ఆస్ట్రోఫోర్  వంటి ప్రైవేట్ కంపెనీలు 2025-26 లోనే గ్రహశకలాలపై పరిశోధనల కోసం ప్రయోగాలు సిద్ధం చేస్తున్నాయి. ఒకవేళ ఇది విజయవంతమైతే, మానవజాతి చరిత్రలో ఒక కొత్త  బంగారు యుగం ప్రారంభమైనట్లేనని నిపుణులు భావిస్తున్నారు.