Cosmetic Surgery Risks : సోషల్ మీడియాలో యుగంలో అందంగా కనిపించాలనే కోరిక రోజురోజుకు పెరుగుతుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ప్రభావం, ఆధునిక జీవనశైలి కారణంగా.. చాలామంది తమ శరీరంపై కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి ప్రయోగాలలో ఒకటి కాస్మెటిక్ సర్జరీ. దీని సహాయంతో తమను తాము అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవల కాస్మెటిక్ సర్జరీ తర్వాత ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మరణించడంతో ఈ టాపిక్‌పై అందరి దృష్టి పడింది. ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో కాస్మెటిక్ సర్జరీల భద్రతపై చర్చ మొదలైంది.
ఎవరా ఇన్‌ఫ్లుయెన్సర్?
ఇటలీకి చెందిన యూలియా బుర్ట్సేవా ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 70,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె వయస్సు సుమారు 38 సంవత్సరాలు. యూలియా ఇటలీలోని నేపుల్స్‌లో తన భర్త గియుసెప్పే, చిన్న కూతురితో కలిసి ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తనను తాను ప్రేమతో కూడిన తల్లిగా పరిచయం చేసుకుని.. ఆమె, ఆమె కూతురికి సంబంధించిన రోజువారీ కంటెంట్ పోస్ట్ చేస్తుంది. వ్లాగ్‌లు, కామెడీ రీల్స్, ఆటలు, జీవనశైలి, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ వంటి కంటెంట్‌ను షేర్ చేస్తుంది.
కాస్మెటిక్ సర్జరీ కోసం రష్యాకు..
ఈ నేపథ్యంలో జనవరి 4వ తేదీన యూలియా తన దేశం ఇటలీ నుంచి బయలుదేరి మాస్కో, రష్యాకు వెళ్లింది. అక్కడ ఆమె కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. సర్జరీకి కొద్దిసేపటి ముందు కూడా ఆమె సోషల్ మీడియాలో కంటెంట్‌ను అప్‌లోడ్ చేశారు. అందులో ఆమె చాలా సంతోషంగా కనిపించారు. అయితే ఒక క్లినిక్‌లో సర్జరీ జరిగిన తర్వాత ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను మరణించినట్లు ధృవీకరించారు.
సర్జరీ తర్వాత క్షీణించిన ఆరోగ్యం
రష్యా మీడియా నివేదికల ప్రకారం.. బ్లాగర్ యూలియా బుర్ట్సేవా మాస్కోలోని ఒక క్లినిక్‌లో కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. సర్జరీ తర్వాత ఆమె పరిస్థితి విషమించింది. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమెను రక్షించలేకపోయారు. మీడియా సమాచారం ప్రకారం.. యూలియా తన పిరుదులను పెద్దవిగా, ఆకర్షణీయంగా మార్చుకోవడానికి సర్జరీ చేయించుకున్నారట.
మరణానికి కారణం అదే..
నివేదికలలో.. సర్జరీ సమయంలో యూలియాకు అనాఫిలాక్టిక్ షాక్ వచ్చిందని.. ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య అని పేర్కొన్నారు. ఈ ప్రతిచర్య మందులు లేదా అనస్థీటిక్ వల్ల సంభవించవచ్చు. అనాఫిలాక్టిక్ షాక్ సమయంలో రక్తపోటు వేగంగా పడిపోతుంది. శరీరంలో దద్దుర్లు లేదా గుర్తులు వస్తాయి. వాపు కూడా రావచ్చు. ఈ అలెర్జీ పరిస్థితి ప్రాణాంతకం కావచ్చు. యూలియాకు కూడా ఇదే జరగడంతో ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు సోషల్ మీడియాలోని బ్యూటీ స్టాండర్డ్స్‌ని ఫాలో అవ్వకపోవడమే మంచిదని చెప్తున్నారు. మరికొందరు నచ్చినట్లు తమని తాము మార్చుకోవచ్చు కానీ.. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.