Queen Elizabeth Dies: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-II కన్నుమూశారు. ‘‘లండన్ బ్రిడ్జ్ ఈజ్ డౌన్’’ అని కోడ్ భాషలో ప్రకటించారు. ఆపరేషన్ లండన్ బ్రిడ్జి పేరిట ఇప్పటికే ఆమె మృతి అనంతర పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో కసరత్తు కూడా చేశారు. బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యాలయం కామన్వెల్త్ దేశాల్లోని ప్రభుత్వాలకు ఈ విషయాన్ని తెలియజేసింది. బకింగ్‌హామ్ ప్యాలెస్ గేట్లకు సాంప్రదాయం ప్రకారం నోటీసులు అంటించారు. క్వీన్ ఎలిజబెత్-II వయసు 96 సంవత్సరాలు. 25వ ఏట నుంచి బ్రిటన్ రాణిగా ఉన్నారు. ఆమె స్కాట్లాండ్ లోని బల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచారు.
ఎలిజబెత్-2.. ఏప్రిల్ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్ స్ట్రీట్‌లో జన్మించారు. గ్రీస్ యువరాజు, నేవీ లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్ ఛార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం. 1952, ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో వారసురాలిగా ఎలిజబెత్‌ను ప్రకటించారు. అయితే ఆ టైంకి ఆమె రాయల్ టూర్‌లో కెన్యాలో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్ 2వ తేదీన ఆమె వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో బ్రిటన్‌కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేక సమయంలో బ్రిటన్ ప్రధానిగా విన్‌స్టన్ చర్చిల్ ఉన్నారు. 15 మంది ప్రధానులు.. ఈమె హయాంలో బ్రిటన్‌కు పని చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌తోపాటుగా పద్నాలుగు దేశాల సార్వభౌమత్వం ఎలిజబెత్-2 చేతిలోనే ఉంటుంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్ ఐల్యాండ్స్, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ది గ్రెనాడైన్స్, తువాలుకు కూడా క్వీన్ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరిస్తున్నారు.
2015 నాటికే ఎలిజబెత్-2 ఇప్పటికే క్వీన్ విక్టోరియాను దాటేసి బ్రిటన్ పాలకురాలిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. క్వీన్ ఎలిజబెత్ - 2 భర్త ఫిలిప్ 2021 ఏప్రిల్‌లో కన్నుమూశారు. ఎలిజబెత్-II తర్వాత ఆమె కొడుకు ప్రిన్స్ ఛార్లెస్ ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్ III పేరుతో కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాణి మరణిస్తే రాజ కుటుంబ సంప్రదాయాలు, ఆమెకు ఉన్న అర్హతల ప్రకారం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేశారు. అన్ని చర్చుల్లో గంటలు మోగించారు. ముఖ్యంగా వెస్ట్‌మిన్‌స్టర్ చర్చి గంటను రాజకుటుంబాల సభ్యులు మృతి చెందితే మోగిస్తారు. ఆ చర్చి గంటను కూడా మోగించారు.
స్కాటిష్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేస్తారు. బల్మోరల్ కోటకు ఎలిజబెత్-II ప్రతి వేసవికాలంలో వెళ్ళేవారు. ఎలిజబెత్-II మృతి చెందిన తర్వాత 10 రోజుల బ్రిటన్ పర్యటనకు వెళ్ళిన చార్లెస్ తిరిగి లండన్ చేరుకున్నాక ఎలిజబెత్-II పార్థివదేహాన్నిబకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి యూకే పార్లమెంటులోని వెస్ట్‌మిన్‌స్టర్ హాల్ కు తరలిస్తారు. 2002లో ఎలిజబెత్-II తల్లి మరణించిన సమయంలో అంత్యక్రియల్లో 1,600 ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు. ఎలిజబెత్-II మృతి పట్ల ప్రజలు నివాళులు అర్పించడానికి వెస్ట్‌మిన్‌స్టర్ కు ప్రజలకు కొన్ని రోజుల పాటు అనుమతిస్తారు. ఎలిజబెత్-II అంత్యక్రియలు జరిగే రోజున యూకే వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటిస్తారు.