Pistol Shrimp : ప్రపంచ మహాసముద్రాల అడుగున నివసించే జీవులలో పిస్టల్ రొయ్య (Pistol Shrimp) ఒక అద్భుతం. శాస్త్రీయంగా ఆల్ఫెయిడే (Alpheidae) కుటుంబానికి చెందిన ఈ చిన్న సముద్ర జీవి, తన పెద్ద, అసమానమైన గిట్ట ద్వారా సృష్టించే శబ్దం, విడుదల చేసే శక్తి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దీని దాడి ఎంత శక్తివంతమైనదంటే, అది తాత్కాలికంగా సూర్యుని ఉపరితలం కంటే వేడిగా ఉండే ఉష్ణోగ్రతను సృష్టిస్తుంది. సముద్రంలో అత్యంత శబ్దకారిణిగా పేరుపొందింది.

Continues below advertisement

ప్రపంచవ్యాప్తంగా 1,100కుపైగా పిస్టల్ రొయ్యల జాతులు ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఉష్ణమండల, ఉపఉష్ణమండల సముద్రాలలో, కోరల్ రీఫ్‌లు, సముద్ర గడ్డి పొలాలు, గుల్లల రీఫ్‌లలో కనిపిస్తాయి. దీని గిట్ట  శరీరంలో 50% కంటే పెద్దదిగా ఉంటుంది.

'పిస్టల్'పనిచేసే విధానం: కావిటేషన్ బబుల్ రహస్యం

పిస్టల్ రొయ్య తన పెద్ద గిట్టను ఒక్కసారిగా వేగంగా మూసివేయడం ద్వారా నీటిని 100 కిమీ/గం (62 మైళ్లు/గం) వేగంతో బయటకు పంపుతుంది. ఈ వేగం చిరుతపులి వేగం కంటే చాలా ఎక్కువ .

Continues below advertisement

ఈ వేగం ఫలితంగా, నీటిలో తక్కువ ఒత్తిడి కలిగిన కావిటేషన్ బబుల్ అనే చిన్న బుడగ ఏర్పడుతుంది. ఈ బుడగ ఒక్కసారిగా పగిలిపోయినప్పుడు, అది భారీ శక్తిని, ఉష్ణోగ్రతను షాక్‌వేవ్‌ను విడుదల చేస్తుంది.

నిమిషాల వ్యవధిలో జరిగే భయంకర దాడి ఫలితాలు:

1.శబ్దం: బబుల్ పగిలినప్పుడు 218 డెసిబెల్స్ వరకు శబ్దం సృష్టిస్తుంది. ఇది సాధారణ తుపాకీ శబ్దం కంటే ఎక్కువ. జెట్ ఇంజిన్ శబ్దం కంటే కూడా ఎక్కువ. ఈ కారణంగానే ఇది సముద్రంలో అత్యంత శబ్దకారిణి జీవులలో ఒకటిగా నిలిచింది.

2. వేడి: బబుల్ పగిలిపోయే అతి తక్కువ సమయంలో (మైక్రోసెకన్లలో), ఉష్ణోగ్రత సుమారు 4,400–4,800°C (8,000°F) చేరుకుంటుంది. ఈ వేడి సూర్యుని ఉపరితలం కంటే లేదా లావా కంటే కూడా వేడిగా ఉంటుంది.

3. దాడి : ఈ శక్తివంతమైన షాక్‌వేవ్ చిన్న చేపలు లేదా ఇతర రొయ్యలను క్షణంలో  చంపుతుంది. ఈ దాడిని రొయ్యలు వేట కోసం మాత్రమే కాకుండా, సమాచార మార్పిడి, తమ భూభాగాన్ని రక్షించుకోవడం, గుంటలు తవ్వడానికి కూడా ఉపయోగిస్తాయి.

రెండవ ప్రపంచ యుద్ధంలో దీని పాత్ర

ఈ చిన్న జీవి శబ్దం రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా నావికాదళానికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. పిస్టల్ రొయ్యల శబ్దం అమెరికా నావికాదళ సోనార్‌ను అడ్డుకుంది, దీంతో నావికులు శత్రు జలాంతర్గాములు ఉన్నాయని పొరబడేవారు.

గోబీ చేపతో విచిత్రమైన స్నేహం

పిస్టల్ రొయ్యలు సముద్ర దిగువన U-ఆకార గుంటలను తవ్వుతాయి. వాటిని జాగ్రత్తగా నిర్వహిస్తాయి. అయితే కొన్ని జాతులు, ముఖ్యంగా టైగర్ పిస్టల్ రొయ్య లేదా రాండల్ పిస్టల్ రొయ్య వంటివి, గోబీ చేపలతో విచిత్రమైన సహజీవన సంబంధం కలిగి ఉంటాయి. ఈ సహజీవనంలో, రొయ్యలు గుంట తవ్వి, గోబీ చేపతో పంచుకుంటాయి. రొయ్యలకు దృష్టి బలహీనంగా ఉంటుంది, కాబట్టి అవి గోబీ చేపలపై ఆధారపడతాయి. ప్రమాదం జరిగినప్పుడు, గోబీ చేప సంకేతాలు ఇస్తుంది, రొయ్య వెంటనే గుంటలోకి దూరిపోతుంది. కొన్ని అసాధారణ సందర్భాలలో, రొయ్యలు గోబీ చేపల మలాన్ని కూడా ఆహారంగా తీసుకుంటాయి. రాండల్ రొయ్యలు వాటి ఎరుపు-తెలుపు చారల కారణంగా "క్యాండీ కేన్ రొయ్య" అని పిలుస్తారు.

పర్యావరణ పాత్ర- ప్రాముఖ్యత

పిస్టల్ రొయ్యలు పర్యావరణ సూచికలుగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన రీఫ్‌లలో వీటి చప్పుడు సర్వసాధారణం. వాతావరణ పరిశోధకులు సముద్ర శబ్దాలను అనుకరించడానికి వీటి శబ్దాలను ఉపయోగిస్తారు, అంతేకాక, నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన 'Our Planet' సిరీస్‌లో బబుల్ శబ్దాల కోసం వీటి శబ్దాలను ఉపయోగించారు.

అక్వేరియం ట్యాంకులలో కూడా ఈ రొయ్యలు ప్రజాదరణ పొందాయి, ఎందుకంటే అవి ట్యాంక్‌కు ఒక ప్రత్యేకమైన "స్నాప్-క్రాకిల్-పాప్" శబ్దాన్ని జోడిస్తాయి. అయితే, ఇవి ఇసుకను తవ్వడం వల్ల ట్యాంక్ లేఅవుట్‌ను మార్చగలవు.