Philippines Earthquake Updates:



ఫిలిప్పైన్స్‌లో మళ్లీ భూకంపం..


ఫిలిప్పైన్స్ మరోసారి భూకంపంతో (Philippines Earthquake) వణికిపోయింది. దేశ రాజధాని మనిలాలో పెద్ద పెద్ద భవనాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు అన్ని భవనాలనూ ఖాళీ చేయించారు. ఎవరూ బిల్డింగ్‌లో ఉండకూడదని అప్రమత్తం చేశారు. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రత నమోదైంది. అయితే...ఈ భూకంపం (Earthquake in Philippines) కారణంగా ప్రాణనష్టం ఏమీ జరగలేదని ప్రాథమిక సమాచారం. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగకపోయినప్పటికీ అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. మళ్లీ మళ్లీ భూకంపాలు నమోదయ్యే ప్రమాదముందని  హెచ్చరించారు. ఈ భూకంప తీవ్రత 79 కిలోమీటర్ల లోతు వరకూ ప్రభావం చూపించినట్టు ఫిలిప్పైన్స్ సెసిమాలజీ ఏజెన్సీ వెల్లడించింది. మనిలాతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ఈ ప్రభావం కనిపించినట్టు అధికారులు తెలిపారు. యూనివర్సిటీలతో పాటు భారీ భవనాలు, అధ్యక్షుడి భవనం, న్యాయశాఖ బిల్డింగ్స్‌లను ఖాళీ చేయించారు. రవాణా శాఖ కూడా అలెర్ట్ అయింది. ట్రైన్ సర్వీస్‌లను నిలిపివేసింది. ఎయిర్‌పోర్ట్‌కి అయితే ఎలాంటి నష్టం జరగలేదు. కొన్ని చోట్ల రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రత నమోదైంది. ఫిలిప్పైన్స్‌లో భూకంపాలు సాధారణమే. ఈ దేశాన్ని "Ring of Fire"గా పిలుస్తారు. చుట్టూ అగ్నిపర్వతాలుండడం వల్ల భూకంపాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఇటీవల సంభవించిన భూకంపం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కనీసం 2 వేల సార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అందుకే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.