Papua New Guinea Violence:  ఆస్ట్రేలియాకు ఉత్తరంగా పసిఫిక్ మహాసముద్రానికి నైరుతి దిక్కున ఉన్న మెలనేషియా అనే ప్రాంతంలోని కొన్ని దీవుల్లో విస్తరించిన పపువా న్యూ గినియా(Papua New Guinea Violence) అతి చిన్న దేశం. అయితే.. గిరిజ‌న(Tribe) ప్రాబ‌ల‌యం ఉన్న దేశం. ప్ర‌స్తుతం ఇక్క‌డి జ‌నాభా 97-99 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే. అయితే.. తాజాగా ఈ దేశం ప్ర‌పంచ వ్యాప్తంగా వార్త‌ల్లోకి ఎక్కింది. ఇక్క‌డి రెండు గిరిజ‌న స‌మూహాల మ‌ధ్య చోటు చేసుకున్న వివాదం చినుకు చినుకు గాలివాన‌గా మారి.. ప్రాణాలు తీసుకునే వ‌ర‌కు వెళ్లింది. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం ఇప్ప‌టివ‌ర‌కు 28 మంది ప్రాణాలు కోల్పోగా.. అన‌ధికారికంగా ఈ సంఖ్య 60 వ‌ర‌కు ఉంటుంద‌ని మీడియా పేర్కొంటోంది. 


ఆస్ట్రేలియా మీడియా క‌థ‌నం మేర‌కు.. 


ప‌పువా న్యూ గునియా దేశంలో చెల‌రేగిన హింస‌పై ఆస్ట్రేలియా(Australia) మీడియా స్పందించింది. గిరిజ‌న ప్రాభావిత‌ ఎంగా ప్రావిన్స్‌లోని వాపెనమండ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రెండు గిరిజ‌న తెగ‌ల మ‌ధ్య‌ హింస చెలరేగినట్లు తెలిపింది. అంబులిన్, సికిన్ తెగల ప్రజలు పరస్పరం కాల్పులు జరుపుకున్నారని చెప్పింది. సోమవారం ఉదయం నాటికి వాపెనమండలోని రోడ్డు పక్కన, కొండలపై 64 మృతదేహాలు కనిపించాయని పేర్కొంది. అయితే.. అధికారులు మాత్రం కేవ‌లం 28 మంది మాత్ర‌మే చ‌నిపోయార‌ని చెబుతున్నారు.  


ఘ‌ర్ష‌ణ‌కు కార‌ణం?


పాపువా న్యూ గినియాలోని ఉత్తర ఐలాండ్స్‌లో గిరిజనుల స‌మూహాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే.. వీరు పొరుగు ప్రాంతాల‌కు చెందిన వారు కూడా ఉంటారు. దీంతో ఈ జాతుల మ‌ధ్య భూమి, వ్య‌వసాయం, ఆహారం, ఆధిప‌త్యం విష‌యంలో త‌ర‌చుగా ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయి.  ముఖ్యంగా వ్య‌వ‌సాయ సుక్షేత్రంగా ఉన్న‌ ఎంగా ప్రావిన్స్‌లో గిరిజ‌నుల మ‌ధ్య వివాదాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఓ రెండు తెగల మధ్య తాజాగా ఆక‌స్మిక దాడి జ‌రిగింది. ఈ దాడుల్లో పురుషులు ఎక్కువ మంది మరణించినట్లు ఆస్ట్రేలియన్ అధికారిక మీడియా తెలిపింది. 


ఇది దారుణం..


గిరిజ‌న జాతుల మ‌ధ్య‌ జరిగిన దాడిలో ఇదే అతి దారుణమైన ఘటన అని దేశ పోలీసు దళంలో సీనియర్ అధికారి జార్జ్ కాకాస్ చెప్పారు. అయితే, పసిఫిక్ దేశం వందలాది తెగలకు నిలయంగా ఉంది.. వీరిలో చాలా మంది ఇప్పటికీ మారుమూల భూభాగంలో నివసిస్తున్నారు. ఇక, గత సంవత్సరం ఎంగా ప్రావిన్స్‌లో 60 మందిని చంపిన ఘర్షణలకు కారణమైన అదే తెగలకు చెందిన వారు తాజా హింసలో పాల్గొన్నారని అధికారులు భావిస్తున్నారు.  కాగా ఈ హింసాకాండలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని పపువా న్యూ గినియా అధికారులు తెలిపారు. ట్రక్కుల్లో మృతదేహాలను తరలించినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గిరిజనుల పోరు ఉద్ధృతమవుతోందన్న హెచ్చరికలు ఉన్నాయని ఎంగా గవర్నర్ పీటర్ ఇపాటాస్ తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.


అతిపెద్ద ఘోరం ఇదే!


పపువా న్యూ గినియాలో తాను చూసిన అతిపెద్ద ఘోరం ఇదేనని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇదే తెగల మధ్య కొన్నేళ్ల క్రితం జరిగిన ఘర్షణలో 60 -80 మంది చనిపోయినట్లు చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతానికి అదనపు భద్రతా దళాలను పంపాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కోరాయి. వెంటనే ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశాయి. మ‌రోవైపు ఈ హింసాకాండపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనను ఆ వార్త కలిచివేసిందని చెప్పారు. పపువా న్యూ గినియాకు సహాయం చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.