Pakistani leaders for Nobel : అమెరికా , ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, 15 రోజుల కాల్పుల విరమణ కు మధ్యవర్తిత్వం వహించినందుకు గాను పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలనే డిమాండ్ ఇప్పుడు పాక్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చిన ఘనత తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్ .ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లదేనని పాకిస్థాన్ ప్రగల్భాలు పలుకుతోంది. ఇస్లామాబాద్ కేంద్రంగా జరిగిన చర్చల ద్వారా ఈ కాల్పుల విరమణ సాధ్యమైందని, దీనివల్ల ప్రపంచ ఇంధన సంక్షోభం తృటిలో తప్పిందని పాక్ చెబుతోంది. ఈ చారిత్రాత్మక ఘనతకు గుర్తింపుగా షరీఫ్‌కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించాలని కరాచీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై విరుచుకుపడటానికి సిద్ధమవుతున్న తరుణంలో, పాకిస్థాన్ జోక్యం చేసుకుని రెండు వారాల విరామం ఇప్పించిందని అక్కడి మేధావులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే గాజా , ఇతర ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నారని గతంలో ట్రంప్ పేరును నోబెల్‌కు ప్రతిపాదించిన పాకిస్థాన్, ఇప్పుడు ఆ గౌరవం తమ సొంత ప్రధానికే దక్కాలని కోరుకుంటున్నాయి. ప్రపంచ దేశాలు పాక్ దౌత్య నీతిని చూసి ఆశ్చర్యపోతున్నాయని, ఇది ఇస్లామాబాద్ సాధించిన విజమని వారు మురిసిపోతున్నారు.
ఈ డిమాండ్‌పై అంతర్జాతీయ స్థాయిలో సెటైర్లు పేలుతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి, పొరుగు దేశాలతో ఎప్పుడూ గొడవలు పడే పాకిస్థాన్, ఇప్పుడు ప్రపంచ శాంతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. నిజానికి ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఆగడం వెనుక అనేక అంతర్జాతీయ సమీకరణాలు ఉన్నాయి తప్ప, పాకిస్థాన్ పాత్ర ఎంతన్నది చర్చనీయాంశమే. కానీ, క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో వేసుకోవడానికి షెహబాజ్ ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తోంది.
ప్రస్తుతం పాకిస్థాన్ సోషల్ మీడియాలో నోబెల్ ఫర్ షెహబాజ్ అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. గతేడాది భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గినప్పుడు కూడా ఇలాగే ట్రంప్ పేరును నోబెల్‌కు ప్రతిపాదించి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు నేరుగా ప్రధానికే ఆ అవార్డు కావాలని కోరుతుండటంతో, ఇది మరీ అతిగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆకలితో అలమటిస్తున్న ప్రజల కష్టాలు తీర్చడం మానేసి, ఇలాంటి ఆస్కార్, నోబెల్ స్థాయి కలలు కనడం పాక్ నేతలకు అలవాటుగా మారిందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
అసలే డొనాల్డ్ ట్రంప్ తనను తాను గొప్ప శాంతిదూతగా భావిస్తుంటారు. గతంలో తనకే నోబెల్ రావాలని ఆశపడిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది, తన వల్లే కుదిరిన సీజ్‌ఫైర్‌కు క్రెడిట్ కొట్టేస్తూ షెహబాజ్ షరీఫ్ నోబెల్ మీద కన్నేశారని తెలిస్తే.. ట్రంప్ ఊరుకుంటారా? ఈ నోబెల్ గోల గనుక వైట్ హౌస్ వరకు చేరితే, పాకిస్థాన్‌కు దక్కాల్సిన కొద్దిపాటి సాయానికి కూడా ట్రంప్ మంగళం పాడే ప్రమాదం ఉంది. పాపం, అవార్డు సంగతేమో కానీ అప్పో సప్పో ఇచ్చే అమెరికా పెద్దాయనకి కోపం వస్తే మాత్రం పాకిస్థాన్ పనైపోయినట్లే!
