Pakistan smart lockdown:     పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసింది.  హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు, అంతర్జాతీయంగా చమురు సరఫరా నిలిచిపోవడంతో పాకిస్తాన్‌లో ఇంధన నిల్వలు నిండుకున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రం కావడంతో దేశాన్ని స్తంభించిపోకుండా చూసేందుకు ప్రభుత్వం అత్యవసరంగా  స్మార్ట్ లాక్‌డౌన్ ప్రకటించింది.

ఇంధన పొదుపు కోసమే ఈ చర్యలు 

గతంలో కాలుష్యం కోసం లాక్‌డౌన్ విధించిన దాఖలాలు ఉన్నప్పటికీ, ఈసారి మాత్రం ఇంధనాన్ని పొదుపు చేయడం  ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాహనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఉన్న కొద్దిపాటి చమురు నిల్వలను అత్యవసర సేవలకు వినియోగించాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేట్ వాహనాల రాకపోకలపై కఠిన నియంత్రణలు విధించారు.    

స్తంభించిన రవాణా వ్యవస్థ 

చమురు సంక్షోభం కారణంగా పాకిస్తాన్‌లోని ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్‌లలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడమే కాకుండా, కార్యాలయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనను తప్పనిసరి చేశారు. పారిశ్రామిక రంగానికి ఇంధన సరఫరాను తగ్గించి, కేవలం గృహ అవసరాలకు, అత్యవసర రవాణాకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.

హార్ముజ్ జలసంధి ఎఫెక్ట్ 

ఇరాన్ తన ప్రతిపాదనలో హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌకకు  2 మిలియన్ డాలర్ల ఫీజు వసూలు చేస్తామని ప్రకటించడం , అంతవరకు సరఫరాలో అనిశ్చితి నెలకొనడం పాకిస్తాన్‌ను మరింత ఇరకాటంలో పడేసింది. తన అవసరాలకు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడే పాకిస్తాన్, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం,సరఫరా దారులు వెనక్కి తగ్గడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

 ఆర్థిక సంక్షోభం ముంగిట                                                                         

ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న పాకిస్తాన్‌కు ఈ యుద్ధం కోలుకోలేని దెబ్బ. ఇంధన కొరత వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకాయి. విద్యుత్ కేంద్రాలకు సరిపడా చమురు అందకపోవడంతో దేశవ్యాప్తంగా గంటల తరబడి పవర్ కట్స్ విధిస్తున్నారు. ఈ స్మార్ట్ లాక్‌డౌన్ ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ, పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప పాకిస్తాన్‌కు ఈ గండం గడిచేలా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.