Karachi Terror Attack :  పాకిస్తాన్ కరాచీలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. షరియా ఫైసల్ ప్రధాన ప్రాంతంలోని  పోర్ట్ సిటీ పోలీసు ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కనీసం 8-10 మంది ఉగ్రవాదులు పోలీసు కార్యాలయంలోకి ప్రవేశించి పోలీసులపై కాల్పులు జరిపినట్లు సమాచారం. భద్రతా బలగాలు రంగంలోకి ఉగ్రదాడి ఎదుర్కొంటుంది. పోలీస్ క్వార్టర్స్ లో  ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పాకిస్తాన్ స్థానిక మీడియా తెలిపింది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.   తాజా సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఆటోమెటిక్ మిషన్ గన్స్, హ్యాండ్ గ్రెనేడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీషా, పోలీస్ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపాలని డీఐజీలను ఆదేశించినట్లు తెలుస్తోంది.  ఈ ఘటనపై సింధ్ గవర్నర్ కమ్రాన్ టెస్సోరి ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 






8-10 ఉగ్రవాదులు దాడి 


అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, షరియా ఫైసల్‌ లోని కరాచీ పోలీసు ప్రధాన కార్యాలయంపై ముష్కరులు దాడి చేశారు. ఐదు అంతస్థుల భవనంలో ఇప్పటి వరకు మూడు అంతస్తులు క్లియర్ అయ్యాయని సింధ్ సీఎం మురాద్ అలీ షా తెలిపారు. రెండు అంతస్తులు, పైన రూఫ్‌టాప్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సింధ్ రేంజర్స్ ప్రతినిధి మాట్లాడుతూ, ఎనిమిది నుంచి పది మంది సాయుధ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు ప్రాథమిక అంచనాలున్నాయన్నారు.  పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ ఫైసల్ బేస్‌తో సహా అనేక వ్యూహాత్మక స్థావరాలకు కరాచీ ప్రధాన మార్గం - షరియా ఫైసల్‌. ఈ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 7:15 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయని పోలీసులు గుర్తించారు.  


హ్యాండ్ గ్రెనేడ్లతో దాడి 


పోలీసు చీఫ్ కార్యాలయం పక్కనే ఉన్న సద్దర్ పోలీస్ స్టేషన్ కూడా దాడికి గురైనట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.  కరాచీ పోలీస్ ఆఫీస్ సమీపంలోని సద్దార్ పోలీస్ స్టేషన్‌పై గుర్తు తెలియని నిందితులు దాడి చేసినట్లు  పీఐ ఖలీద్ హుస్సేన్ మెమన్ తెలిపారు. ఎక్కడికక్కడ కాల్పులు జరుగుతున్నాయని అని ప్రకటనలో పేర్కొన్నారు. దాడి జరిగిన ప్రదేశానికి అదనపు పోలీసు బలగాలు, రేంజర్‌లను రప్పించారు. డీఐజీ ఇర్ఫాన్ బలోచ్ మాట్లాడుతూ భీకరమైన కాల్పులు కొనసాగుతున్నాయని, అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తామని చెప్పారు.  గాయపడిన వారి సంఖ్య తెలిపేందుకు ఆయన నిరాకరించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తివివరాలు తెలియజేస్తామన్నారు.  రేంజర్లు క్యూఆర్‌ఎఫ్‌తో పాటు నగరంలోని మొత్తం పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి పిలిపించామని ఆయన చెప్పారు. దాడి చేసినవారు హ్యాండ్ గ్రెనేడ్లను ఉపయోగించారని చెప్పారు.  


ఇద్దరు మృతి 


క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ (క్యూఆర్‌ఎఫ్) ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిందని రేంజర్స్ ప్రతినిధి తెలిపారు. రేంజర్లు, పోలీసులు ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ కాల్పుల్లో మృతిచెందిన ఇద్దరి మృతదేహాలను జిన్నా పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ (జేపీఎంసీ)కి తరలించినట్లు పోలీసులు  తెలిపారు. మృతుల్లో ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక వాలంటర్  ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిలో పోలీసు లతీఫ్, రేంజర్స్ అధికారి అబ్దుల్ రహీమ్, వాలంటీర్ ఉన్నట్లు గుర్తించారు.