Imran Khan: 


జైల్లోనే ఇమ్రాన్ ఖాన్..


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. అయితే...ప్రస్తుతానికి పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీ రద్దైంది. ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్‌ బాధ్యతలు తీసుకున్నారు. కానీ...అధికారం అంతా సైన్యం చేతుల్లోనే ఉంది. ఇమ్రాన్ ఖాన్‌పై పాక్ సైన్యం కుట్రపన్ని ఇలా జైలుపాలు చేసిందని PTI నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ సైన్యం...ఇమ్రాన్‌కి రెండు ఆప్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకోవడమో లేదంటే ఉరిశిక్షకు సిద్ధం కావడమో నిర్ణయించుకోవాలని ఆదేశించినట్టుగా సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం ఇమ్రాన్‌ ఖాన్‌కి కత్తిమీద సామైంది. తరవాత ఏం జరగనుందో అన్న ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. 


ట్విటర్‌లో వీడియో..


ఇమ్రాన్ ఖాన్ ఇటీవలే ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. పాకిస్థాన్‌కి స్వేచ్ఛనివ్వాలని, అభివృద్ధి చేయాలని కలలు కన్న తనకు ఈ శిక్ష పడాల్సిందే అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌ జైల్లో ఉన్న ఫొటోతో, పాత వీడియోలన్నీ కలిపి ఎడిట్ చేశారు. "అటోక్ జైల్, బరాక్ నంబర్ 3, ప్రిజనర్ నంబర్ 804" అంటూ మొదలైన ఈ వీడియోలో ఇమ్రాన్ ఖాన్ పాక్‌ కోసం ఏం చేయాలనుకున్నాడో వివరించారు. పాకిస్థాన్‌ కోసమే ప్రపంచ కప్ సాధించిన తనను దేశ ద్రోహిలా జైల్లో పడేశారని ఈ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇమ్రాన్.


"ఇమ్రాన్..మీరు పాకిస్థాన్‌కి ప్రపంచ కప్ సాధించారు. మూడు క్యాన్సర్ హాస్పిటల్స్ కట్టించారు. రిమోట్ ఏరియాలోనూ ఆసుపత్రి నిర్మించారు. మీ కంఫర్ట్ వదులుకుని మరీ దేశానికి మంచి చేశారు. ప్రజల్ని మేల్కొలిపారు. కశ్మీరీలు, పాలస్థీనియన్ల కోసం గొంతెత్తారు. వాళ్ల తరపున పోరాటం చేశారు. మాఫియాని అణిచారు. ఇవన్నీ చాలా పెద్ద నేరాలు. అందుకే జైలు నుంచి విడుదలవ్వనీయరు"


- ఇమ్రాన్‌ ఖాన్ షేర్ చేసిన వీడియో నుంచి