Justin Trudeau: భారత్‌, కెనడా మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ 18న కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేవద్ద గురుద్వారా వద్ద ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అధినేత హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను కాల్చి చంపారు. ఈ హత్యకు సంబంధించి భారత దౌత్యవేత్తను తమ దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించడంతో ఈ విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో  కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదంపై స్పందించారు. తాను భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి, ఉద్రిక్తతను పెంచడానికి చూడటం లేదన్నారు. హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యను భారత్ అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 


జూన్‌లో జరిగిన సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని జస్టిన్ ట్రూడో గతంలో ఆరోపించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తోందని, అమెరికా సైతం తీవ్ర ఆందోళన చెందుతోందని అన్నారు. తాజాగా మంగళవారం ట్రూడో విలేకరులతో మాట్లాడుతూ.. తాము భారత్‌ను రెచ్చగొట్టడానికి చూడటం లేదన్నారు. తాము భారత్‌తో కలసి పని చేయాలనుకుంటున్నామని, ఈ క్రమంలో ప్రతి విషయం స్పష్టంగా సరైన ప్రక్రియలో ఉన్నాయని నిర్ధారించుకోవాలనని అనుకుంటున్నట్లు చెప్పారు. 


సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ ఏజెంట్లు, కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు మధ్య సంబంధాల గురించి  కెనడియన్ సెక్యూరిటీ ఏజెన్సీలకు విశ్వసనీయమైన సమాచారం ఉందని అన్నారు. అయితే ట్రూడో వాదనలను భారత్ తిరస్కరించింది. కెనడాలో హింసాత్మక చర్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు పూర్తి అసంబద్ధమైనవని, ప్రేరేపించబడినవి అంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత ప్రధాని మోదీపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొంది.


ఈ నేపథ్యంలోనే వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. గత రెండు రోజులుగా కెనడా భారత్‌లు సీనియర్ దౌత్యవేత్తలను బహిష్కరించాయి. ఇందులో భాగంగానే కెనడా దౌత్యవేత్తను ఐదు రోజుల్లో భారత్‌ను విడిచివెళ్లాలని భారత్ సూచించింది. ఇటీవల భారతదేశంలో జరిగిన G20 సందర్భంగా ట్రూడో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య ఈ సమస్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో కెనడాలోని తీవ్రవాద సంస్థలు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, భారతీయ దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తున్నాయని, భారతీయ సమాజాన్ని, వారి ప్రార్థనా స్థలాలను బెదిరిస్తున్నాయని ప్రధాని మోదీ తెలియజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కెనడా ఎప్పుడూ భావ ప్రకటనా స్వేచ్ఛను, మనస్సాక్షిని, శాంతియుత నిరసనను సమర్థిస్తుందని ట్రూడో చెప్పారు. అలాగే హింసను అడ్డుకుంటుందని, విద్వేషాలపై వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ట్రూడో విలేకరులతో చెప్పాడు. ఆ తరువాత కొద్ది రోజులకే కొద్దిసేపటికే సమస్య తీవ్రంగా మారింది. 


కెనడా ప్రవాస సిక్కులకు ఇష్టమైన దేశం. ఇక్కడ తీవ్రవాదం పుట్టగొడుగుల్లా పెరుగుతోందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో భారత దౌత్య కార్యాలయాలు, ప్రజలు, ఆలయాలపై ఖలిస్థానీల దాడులు పెరిగాయి. ముఖ్యంగా కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో ఇటీవల పలు ఘటనలు జరిగాయి. మార్చిలో లండన్‌లోని భారత హైకమిషనరు కార్యాలయంపై దాడి జరిగింది. భారత పతాకాన్ని అవమానించారు. జులైలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ శివార్లలోని మేరీల్యాండ్‌లో ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ విద్యార్థులపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ తరచూ కెనడాలో ఖలిస్థానీ రెఫరెండాలు నిర్వహిస్తోంది.  


అసలు ఈ నిజ్జర్?
నిజ్జర్‌ పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలోని భార్‌ సింగ్‌పుర గ్రామంలో పుట్టి 1997లో కెనడాకు ప్లంబర్‌గా వలస వెళ్లాడు. అప్పటి నుంచి ఖలిస్థానీ వేర్పాటువాదులతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ ఏర్పాటు వెనుక కీలకంగా వ్యవహించాడు. 2020లో నిజ్జర్‌ను భారత్‌ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2007లో లుథియానాలో జరిగిన బాంబుపేలుడు కేసులో నిజ్జర్‌ కీలక సూత్రధారి. ఈ ఏడాది జూన్‌ 18న కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేవద్ద గురుద్వారా వద్ద హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను కాల్చి చంపారు.