Donald Trump on H-1B Visa: సమర్థులైన వ్యక్తులు తమ దేశంలోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు. హెచ్1బీ వీసాల విస్తరణపై తమ పార్టీతోపాటు దేశంలో  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టబద్ధమైన వలసలను కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నేపథ్యంలో ట్రంప్​ ఈ అంశంపై స్పందించారు. తనకు రెండు వైపుల వాదనలు నచ్చాయన్నారు. అయితే, సాఫ్ట్​వేర్​లతోపాటు సమర్థవంతులు, గొప్పవారు అమెరికాలోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్‌ అన్నారు. 

'రెండు వాదనలనూ సమర్థిస్తున్నా'ఒరాకిల్​ సీటీఓ ల్యారీ ఎల్లిసన్​, సాఫ్ట్​బ్యాంక్​ సీఈఓ సమయోసి సన్​, ఓపెన్​ ఏఐ సీఈఓ సామ్​ ఆల్ట్​మ్యాన్​తో కలిసి వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్​1బీ వీసాల అంశంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ‘ఈ అంశంపై నాకు రెండు వైపుల వాదనలూ నచ్చాయి. సమర్థవంతులైన వ్యక్తులు మన దేశంలోకి రావడాన్ని నేను ఇష్టపడతాను. కేవలం ఇంజినీర్ల గురించి మాత్రమే నేను మాట్లాడటం లేదు. అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నా. దేశ వ్యాపార, వాణిజ్యాన్ని విస్తరించేందుకు మాకు సమర్థులైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలి. అది హెచ్‌1బీ వీసాతో సాధ్యమవుతుంది. అందుకే నేను ఆ రెండు వాదనలను కూడా సమర్థిస్తున్నా’ అని ట్రంప్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

భిన్నాభిప్రాయాలువలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్‌ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే హెచ్​1బీ వీసాలపై చర్చ మొదలైంది. చట్టబద్ధమైన వలసలకు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి మద్దతు ఇస్తుంటే ఇతర నేతలు మాత్రం అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంటున్నారు. 

నిక్కీ హేలీ భిన్నమైన వాదనమస్క్​, వివేక్​ రామస్వామి మాట్లాడుతూ.. అర్హత కలిగిన సాంకేతిక నిపుణులు అమెరికాకు వచ్చేందుకు హెచ్‌1బీ వీసా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఈ విషయంపై రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మహిళా నేత నిక్కీ హేలీ భిన్నమైన వాదన వినిపించారు. తాను సౌత్‌ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన సమయంలో నిరుద్యోగిత రేటు 11 శాతం నుంచి 4 శాతానికి పడిపోయిందని విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాం కాబట్టే అది సాధ్యమైందన్నారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్‌ తయారీలో రాణిస్తున్నారని అన్నారు.