Nepal Floods: చైనా సరిహద్దు సమీపంలో నేపాల్‌లో ఉన్న భోటెకోషి నదికి వచ్చిన వరద భారీ విధ్వంసం సృష్టించింది. నది ఉప్పొంగి మెరుపు వరదలు రావడంతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ విపత్తులో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని, వీరిలో 291 మంది విదేశీయలు ఉన్నారు. అందులో 105 మంది భారతీయులు ఉన్నారని నేపాల్ టూరిజం బోర్డ్ వెల్లడించింది. మరో 37 మంది ఎన్నారైలు ఉన్నారు. గల్లంతయిన వారిలో 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు.
భోటెకోషి నది వరదల్లో పలు జల విద్యుత్ కేంద్రాలు, భారీ నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. వందలాది మంది గల్లంతు కావడంతో ఈ జల ప్రళయం వల్ల సంభవించిన నష్టాన్ని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. గల్లంతైన వారి కోసం పెద్ద ఎత్తున సహాయ, రక్షణ చర్యలు చేపట్టారు. నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటెకోషి నదిలో వచ్చిన ఆకస్మిక వరద కారణంగా బుధవారం తెల్లవారుజామున మధ్య నేపాల్‌లోని పలు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి.
భోటెకోషి నది ఒడ్డున ఉన్న రహదారులు, వంతెనలు, మార్కెట్లు, భద్రతా చెక్‌పోస్టులు దెబ్బతిన్నాయి. నేపాల్ ఆర్మీ ప్రతినిధి ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం వరకు 25 మందిని సురక్షితంగా రక్షించారు. నేపాల్ సైన్యం, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (APF), నేపాల్ పోలీస్ సిబ్బంది సహాయ, రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. దూర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని వేగంగా చేరుకోవడానికి 14 హెలికాప్టర్లను కూడా మోహరించారు.
నేపాల్‌లో భారీ విధ్వంసం
అకస్మాత్తుగా భోటెకోషి నదికి వచ్చిన ఈ వరద తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయ, రక్షణ పనులు ప్రారంభించినట్లు నేపాల్ ఆర్మీ తెలిపింది. ఉత్తర నేపాల్‌లో సంభవించిన తీవ్ర వరద సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర నష్టం కలిగించిందని అధికారులు తెలిపారు. నది ప్రవాహం ఉన్న అనేక జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి, ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పాల్ ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల కోసం భారత్, చైనా నుంచి కూడా సహాయం కోరింది.
క్యాబినెట్ నిర్ణయాల గురించి సమాచారం ఇస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ రెండు దేశాలతో సమన్వయం చేసి సహాయ సహకారాల కోసం చూస్తుందని ప్రభుత్వ ప్రతినిధి సస్మిత్ పోఖ్రెల్ తెలిపారు. నివేదికల ప్రకారం, నేపాల్- చైనా సరిహద్దు సమీపంలోని తిమురే ప్రాంతంలో ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన సిబ్బంది 9 మంది వరదల్లో గల్లంతైనట్లు తెలుస్తోంది.
