Nepal appoints Sushila Karki as first female executive head:   నేపాల్ చరిత్రలో  ఓ మహిల ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.  73 ఏళ్ల మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ, దేశ తొలి మహిళా తాత్కాలిక ప్రధానమంత్రిగా శుక్రవారం నియమితులయ్యారు. 2016లో నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించిన కార్కీ, ఇప్పుడు జెన్ జీ నేతృత్వంలోని ఉద్యమం ద్వారా తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి ఎంపికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు.  

సెప్టెంబర్ 8, 2025న  ప్రారంభమైన జెన్ జీ నిరసనలు, సోషల్ మీడియా నిషేధం, అవినీతి,  రాజకీయ నాయకుల  బంధుప్రీతిపై విస్తృతమైన అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ నిరసనలు   హింసాత్మకంగా మారి, పార్లమెంట్, రాష్ట్రపతి నివాసం,  ప్రభుత్వ భవనాలపై దాడులు జరిగాయి. ఈ హింస తర్వాత, ప్రధానమంత్రి కెపి శర్మ ఓలీ ,  అతని మంత్రివర్గం రాజీనామా చేయడంతో, నేపాల్ సైన్యం రాజధానిని స్వాధీనం చేసుకుంది. ఈ అల్లకల్లోల సమయంలో, జెన్ జీ ఉద్యమం నాయకులు డిస్కార్డ్ అనే ఉచిత కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లో నాలుగు గంటల సుదీర్ఘ వర్చువల్ సమావేశంలో సుశీలా కార్కీని తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో దాదాపు 4,000 మంది నిరసనకారులు పాల్గొన్నట్టు నివేదికలు తెలిపాయి.   నీతి, స్వతంత్రత,   అవినీతికి వ్యతిరేకమైన ఆమె గత రికార్డు ఆమెను ఈ పదవికి అత్యంత ఆమోదయోగ్య అభ్యర్థిగా చేశాయి.

రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ శుక్రవారం కార్కీ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. సుశీలా కార్కీ జూన్ 7, 1952న బిరట్‌నగర్‌లోని శంకర్‌పూర్‌లో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1972లో బిరట్‌నగర్‌లోని మహేంద్ర మోరాంగ్ క్యాంపస్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత, భారతదేశంలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ,  1978లో త్రిభువన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. 1979లో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన కార్కీ, 1986-1989 మధ్య మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్‌లో బోధన కూడా చేశారు. 1988-1990 మధ్య కోషి జోనల్ బార్ అధ్యక్షురాలిగా,   2002-2004 మధ్య బిరట్‌నగర్ అప్పీలేట్ బార్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2004లో సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు,   2009లో సుప్రీం కోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా, 2010లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 జూలైలో, నేపాల్ సుప్రీం కోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన కార్కీ, అవినీతి కేసులపై సంచలన తీర్పులతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆమె బెంచ్ మంత్రి జయ ప్రకాష్ గుప్తాను అవినీతి కేసులో జైలుకు పంపింది. నేపాలీ మహిళలు తమ పిల్లలకు పౌరసత్వం అందించే హక్కును కల్పించే చారిత్రక తీర్పును చ్చారు. 

ఆమె న్యాయమూర్తిగా ఉన్న సమయంలో 2017లో షేర్ బహదూర్ దేవబా నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెపై అభిశంసన ప్రతిపాదన తెచ్చింది.  ఈ అభిశంసనకు అవసరమైన రెండు-మూడవ వంతు మెజారిటీ లభించలేదు. సుశీలా కార్కీ ఒక స్పష్టమైన, అవినీతి వ్యతిరేక జీవనశైలికి ప్రసిద్ధి చెందారు.