India reacts to the beheading of Indian: అమెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్‌లో జరిగిన చంద్రమౌళి నాగమల్లయ్య హత్య ఉదంతం ఇండియాలోనూ సంచలనం సృష్టించింది. అతని పేరు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఎక్కడి వారు అని ఎక్కువ మంది ఆరా తీశారు. ఆయన కుటుంబం కర్ణాటక నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిందని గుర్తించారు. స్నేహితులు, పరిచయస్తులంతా నాగమల్లయ్యను బాబ్ అని పిలుచుకుంటూ ఉంటారు.
భారత ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ వెంటనే వివరాలను సేకరించి కేంద్రానికి నివేదిక పంపించారు. ఎంబసీ అధికారులు ఆ కుటుంబాన్ని సంప్రదించారు సాధ్యమైన సహాయాన్ని అందిస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ కేసును దగ్గరగా గమనిస్తోందని.. నాగమల్లయ్య కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తోందని తెలిపారు. యఅలాగే టెక్సాస్‌లోని భారతీయ సమాజం నాగమల్లయ్య కుటుంబానికి మద్దతుగా ఒక ఫండ్‌రైజర్‌ను ప్రారంభించింది, ఇది అంత్యక్రియల ఖర్చులు, కుటుంబ జీవన ఖర్చులు , నాగమల్లయ్య కొడుకు కళాశాల విద్య కోసం ఉపయోగిస్తారు.
చంద్రమౌళి "బాబ్" నాగమల్లయ్య కర్ణాటక నుంచి అమెరికాకు వెళ్లారు. డల్లాస్‌లో తన భార్య, 18 ఏళ్ల కొడుకుతో నివసిస్తున్నాడు. స్నేహితులు , కుటుంబ సభ్యులు "బాబ్"గా పిలుస్తారు. హోటల్‌లో ఒక చిన్న వివాదం కారణంగా కిరాతకంగా క్యూబన్ వ్యక్తి హత్య చేశాడు. ఈ హత్య బాధితుడి భార్య మరియు 18 ఏళ్ల కొడుకు ముందే జరిగింది. వారు అతన్ని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ దాడిని ఆపలేకపోయారు.
సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, కోబోస్-మార్టినెజ్ ఒక గది నుంచి కత్తి తీసుకుని, నాగమల్లయ్యను వెంబడించి దాడి చేశాడు. దాడి సమయంలో కోబోస్-మార్టినెజ్ నాగమళ్లయ్య జేబుల నుంచి అతని సెల్‌ఫోన్ , కీ కార్డ్‌ను తీసుకున్నాడు. చివర తలను కత్తితో నరికి, దానిని సాకర్ బాల్‌లా తన్నినట్టు ఒక సాక్షి పేర్కొన్నాడు. యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్ క్యూబన్ జాతీయుడు. అతనిపై గతంలో కాలిఫోర్నియాలో ఒక శిక్ష, ఫ్లోరిడా, హ్యూస్టన్‌లో అరెస్టుల చరిత్ర ఉంది. యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ప్రకారం, కోబోస్-మార్టినెజ్‌పై డిపోర్టేషన్ ఆర్డర్ ఉన్నప్పటికీ, "తొలగింపుకు గణనీయమైన అవకాశం లేదు" అనే కారణంతో జనవరి 13, 2025న విడుదలయ్యాడు.
కోబోస్-మార్టినెజ్‌ను డల్లాస్ కౌంటీ జైలులో కాపిటల్ మర్డర్ (capital murder) ఆరోపణలు నమోదు చేశారు. దోషిగా తేలితే, అతనికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు.