Men festivals With Bottles: మహిళల దినచర్యలో పూజలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక శ్రావణ మాసం వంటి ప్రత్యేక మాసాల్లో వారి హడావుడి గురించిచెప్పాల్సిన పని లేదు. వ్రతాలు చేసుకుని వాయినాలు మార్చేసుకుంటూ ఉంటారు. ఈ పూజల్లో మగవాళ్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. వారి పని.. పూజల పేరుతో అయ్యే ఖర్చులు పెట్టుకోవడం.. చూస్తూ ఉండటమే. ఇదేదో బాగుందని..నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామంలోని పురుషులు తాము కూడా పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అసలు దేవుళ్లకు తమ ఇంటి మహిళలు పూజలు చేస్తున్నారు కాబట్టి.. తాము తమ ఆనందాల కోసం పూజలు చేయాలనుకున్నారు. అందుకే వెరైటీగా.. ఆలోచించారు. చివరికి ఓ ప్లాన్ రెడీ చేసుకున్నారు.
వాయినాల సంప్రదాయం పాటించాలని మగాళ్ల నిర్ణయం
వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం అనే సంప్రదాయాన్ని తమదైన పద్దతికి అన్వయిస్తే ఎలా ఉంటుందా ్ని బాగా ఆలోచించి కొత్త పద్దతిని తీసుకు వచ్చేశారు. దాని ప్రకారం ఓ మంచి ముహుర్తం పెట్టేసుకుని రంగంలోకి దిగిపోయారు. ఫలానా రోజు..ఫలానా చోట.. వాయినాలు ఇచ్చి పుచ్చుకుందామని మాట్లాడుకున్నారు. అ ప్రకారం ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకున్నట్లుగానే అంతా ఆ సమయానికి అక్కడికి వెళ్లారు.
మద్యం బాటిళ్లను సంప్రదాయంగా ఇచ్చి పుచ్చుకునేలా ఏర్పాట్లు
చక్కగా చాపలు పర్చుకున్నారు. సెటప్ అంతా రెడీ చేసుకున్నాయి. ఎవరు ఎవరికి ఎలాంటి వాయినాలు ఇవ్వాలో కూడా రెడీ చేసుకున్నారు. బొట్లు పెట్టడం.. కండువాలు కప్పడం వంటి సంప్రదాయాలను కూడా మర్చిపోలేదు. అన్ని ఏర్పాట్లు చేసుకుని వాయినాల కార్యక్రమం ప్రారంభించారు. ఇంతకూ వారిచ్చుకుంటున్న వాయినాల్లో ఏముంటాయంటే.. మద్యం బాటిల్స్. స్నేహితులను పిలుచుకొని ఒకరికొకరు బొట్లు పెట్టుకొని, కండువాలు సమర్పించుకొని, మందు బాటిల్లతో వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు.
కించ పరుస్తున్నారని కొంత మంది ఆగ్రహం - వీడియోలు వైరల్
నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామంలో యువకులు మగవాళ్ళ వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు రావడంతో వైరల్ గా మారాయి. ఏదేమైనా మగవారి వాయనాలు పలువురికి నవ్వులు తెప్పిస్తున్నాయి. అయితే నవ్వులాటకు అయినా ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిది కాదని.. సంప్రదాయాలను, మహిళలు చేసే పూజల్ని కించ పర్చడం మంచిది కాదని కొంత మంది వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.