Navy Staff Died Due To Helicopters Collided In Malaysia: మలేషియాలో (Malaysia) మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు గాలిలోనే ఒకదానికొకటి ఢీకొని 10 మంది సిబ్బంది మృతి చెందారు. రిహార్సల్స్ లో భాగంగా విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలేషియా అధికారుల కథనం ప్రకారం.. ఆ దేశంలో ఈ నెల 26న (శుక్రవారం)  రాయల్ మలేషియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా పెరక్ లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్ సితియావాన్ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్దిసేపటికే గగనతలంలో ప్రమాదవశాత్తు ఢీకొని కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు ఉన్నారు. హెలికాప్టర్లలో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో పడిపోగా.. మరొకటి స్విమ్మింగ్ పూల్ లో కూలిపోయింది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఇటీవల జపాన్ లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. గత శనివారం అర్ధరాత్రి ప్రత్యేక శిక్షణ నిమిత్తం వెళ్లిన రెండు నౌకదళ హెలికాప్టర్లు గగనతలంలోనే ఢీకొని సముద్రంలో కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు గల్లంతయ్యారు. అయితే, ఇప్పటివరకూ గల్లంతైన వారి ఆచూకీ తెలియరాలేదు.






Also Read: మెక్‌డొనాల్డ్స్‌ ఉద్యోగిపై కస్టమర్ దాడి,ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు