చిన్నప్పుడు చందమామ రావే...జాబిల్లి రావే అని అమ్మ గోరుముద్దలు తినిపించటం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆకాశంలో దూరంగా, తెల్లగా మెరుస్తూ కనిపించే చందమామ అంటే చిన్నప్పటి నుంచి అందరికీ తెలియని ఎమోషన్. ముఖ్యంగా తెలుగు వాళ్లైతే చందమామ అంటూ ఏదో సొంత మావయ్యను పిలుచుకునేంత ఎటాచ్ మెంట్. అమావాస్య రోజు ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతూ...నిండు పున్నమి రోజు వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో ఆడుకుంటూ గడిపిన రోజులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అందుకే చందమామ అంటే అందరికీ ఫేసినేషన్.
చివరిసారి మనిషి చంద్రుడిపై అడుగుపెట్టింది 1972 డిసెంబర్ లో. అంటే ఈ డిసెంబర్ కి దాదాపు యాభై ఏళ్లైపోతోంది. ఇప్పుడు ఆర్టెమిస్ పేరుతో మళ్లీ మనిషి చంద్రుడిపై అడుగుపెట్టేందుకు నాసా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 29 న ఫ్లోరిడాలోని నాసా కు చెందిన జాన్ ఎఫ్ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్ 1 ను ప్రయోగించనున్నారు. సరే ఆర్టిమెస్ 1 ప్రయోగం వల్ల ఉపయోగం ఏంటీ ...అసలు ఆర్టిమెస్ ప్రాజెక్ట్ లో ఎలాంటి ప్రయోగాలు చేస్తారు అనేది తర్వాతి వీడియోల్లో మాట్లాడుకుందాం. ముందు చంద్రుడి మీద అసలు ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం.
సైన్స్ పరంగా చూసినా చందమామ మానవ జాతికి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ భూమి కాకుండా మనం అడుగుపెట్టిన ఖగోళ ప్రాంతం అదొక్కటే. భూమి సైజులో కేవలం పావు వంతు మాత్రమే ఉంటుంది మన చందమామ. భూమి నుంచి 2లక్షల 38 వేల 855 మైళ్ల దూరంలో ఉంటుంది. ఒక పెద్ద రాయిలా ఉంటుంది. గ్రావిటీ కూడా భూమితో పోలిస్తే చంద్రుడి మీద చాలా తక్కువ. అంటే భూమిపై మన బరువు వంద కిలోలు అయితే చంద్రుడి మీద 16.5 కిలోలు మాత్రమే ఉన్నట్లు ఫీలవుతాం. కారణం గ్రావిటీ. చంద్రుడికి సొంతంగా లైట్ ఉండదు. సూర్యుడి నుంచి వచ్చే కాంతిని రిఫ్లెక్ట్ చేయటం ద్వారా మనకు ఆకాశంలో అంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వాతావరణం కూడా ఉండదు. ఇప్పటికీ అమెరికా పాతిన జెండాలు, అక్కడికి వెళ్లిన వ్యోమగాముల కాలి గుర్తులు కూడా అలాగే ఉండి ఉంటాయి. చంద్రుడు భూమి చుట్టూ ఓ శాటిలైట్ లా తిరుగుతూ తన గురుత్వాకర్షణ శక్తి ద్వారా మన భూమి మీద సముద్రాల కదలికలను ప్రభావితం చేస్తూ ఉంటాడు.
చంద్రుడిపై మనిషి ఎందుకీ ప్రయోగాలు
అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, మన ఇస్రో ఇలా చాలా అంతరిక్ష సంస్థలకు చంద్రుడిపై ప్రయోగాలంటే ఎన లేని ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో భూమికి హాల్ట్ లా ఉపయోగపడగలిగే ప్రాంతం చంద్రుడు మాత్రమే. ఇప్పటివరకూ మన సైన్స్‌ను వాడుకుంటూ చంద్రుడిపై మాత్రమే మనిషి సేఫ్‌గా ల్యాండ్ కాగలిగాడు. అక్కడి పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగాడు. 1972 వరకూ నాసా పది సార్లు మనిషిని చంద్రుడిపైకి సేఫ్‌గా పంపించి తిరిగి వెనక్కి తీసుకురాగలిగింది. ఇస్రో అయితే చంద్రయాన్ ద్వారా చంద్రుడిపై నీటి జాడలను కనుగొనే ప్రయోగాలను మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది.
సో ఇప్పుడు రేపు విశ్వంలో వేర్వేరు గ్రహాలపైకి మనిషి ప్రయోగాలు జరపాలన్నా..ప్రత్యేకించి మరో మానవ ఆవాసంగా భావిస్తున్న మార్స్ పై ప్రయోగాల కోసం చంద్రుడినే మనకు వయా పాయింట్ గా మార్చుకోవాలని నాసా భావిస్తోంది. సౌర కుటుంబంలో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు భూమిపై నుంచి అంతరిక్ష ప్రయోగాల కోసం ఖర్చు చేసే కంటే...చంద్రుడిపైనే స్థావరాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా వాటిని మరింత సులభతరం చేసుకోవాలని నాసా సహా అన్ని అంతరిక్ష సంస్థలు భావిస్తున్నాయి. చంద్రుడిపై కాలనీలు ఏర్పాటు చేయటం, రియల్ స్టేట్, కమర్షియలైజేషన్ ద్వారా అటు అంతరిక్ష ప్రయోగాలతో పాటు ఇటు మనుషులకు భూమి కాకుండా రెండో శాశ్వత ఆవాస కేంద్రంగా చంద్రుడిని మార్చాలని నాసా తో పాటు అనేక ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు ఉవ్విళ్లూరుతున్నాయి.
చివరిగా ఇన్నాళ్లుగా మనిషికి అంతు చిక్కని రహస్యంగా మిగిలిన పోతున్న చంద్రుడి దక్షిణ ధ్రువంపైనా ప్రయోగాలు జరపటం ద్వారా ఆర్టిమెస్ 1 మానవ అంతరిక్ష ప్రయోగాల్లో కీలక దశకు చేరుకోవాలని భావిస్తోంది. అందుకే ప్రాజెక్ట్ ఆర్టిమెస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ అంత అటెన్షన్ ను డ్రా చేస్తోంది.