Maldives MPs fight in Parliament: మాల్దీవుల పార్లమెంటు అట్టుడికి పోయింది. ప్రజాప్రతినిధులు రౌడీల్లా కొట్టుకున్నారు. పార్లమెంట్ సభ్యుల ముష్టిఘాతాలు, తోపులాటలతో  రణరంగాన్ని తలపించింది. కెబినెట్‌ (Cabinet)తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటులో ఆదివారం ఓటింగ్‌ (Voting)నిర్వహించారు. ఈ సందర్బంగా సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార, విపక్ష ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. పోడియంపైకి దూసుకెళ్లిన కొందరు సభ్యులు....స్పీకర్‌ కార్యకలాపాలను అడ్డు తగిలారు. స్పీకర్‌తో పాటు అక్కడున్న వారితో గొడవకు దిగారు. బెంచీల పైనుంచి నడుచుకుంటూ దూసుకెళ్లారు. స్పీకర్‌ను కూర్చీలో నుంచి పడేసేందుకు ప్రయత్నించారు. MDP MP ఇసా, PNC ఎంపీ అబ్దుల్లా షహీమ్ అబ్దుల్ హకీమ్ మధ్య గొడవ జరిగింది. ఎంపీలు ఒకరిపైఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఇద్దరు ఎంపీలు కిందపడిపోయారు. తనను పట్టుకున్న ఎంపీని...మరో ఎంపీ బూటు కాళ్లతో తన్నాడు. మార్షల్స్‌, భద్రతా సిబ్బంది వచ్చి వారిని చెదరగొట్టారు. 


అధ్యక్షుడిగా చైనా అనుకూల వాది మయిజ్జు


మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీన్‌ సన్నిహితుడు మహ్మద్‌ ముయిజ్జు విజయం సాధించారు. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ప్రతిపక్ష పార్టీ ఎంపీలు వ్యతిరేకించారు. ఓటును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎండీపీ పార్టీ ఎంపీ ఇసాపై అధికార పీఎన్‌సీ పార్టీ ఎంపీ షహీమ్‌ దాడికి పాల్పడ్డారు.  కాళ్లు పట్టుకుని కిందపై పడేశారు. దీంతో షహీమ్‌పై ఇసా పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామంతో పార్లమెంట్‌లో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఇసా దాడిలో షహీమ్‌ తీవ్రంగా గాయపడడంతో...ఆస్పత్రికి తరలించారు. అనంతరం పార్లమెంట్‌లో చర్చ జరిగింది. 


 భారత పశ్చిమ తీరానికి సమీపంలోనే  మాల్దీవులు


మాల్దీవులు భారత పశ్చిమ తీరానికి సమీపంలోనే ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే  కీలకమైన సముద్ర మార్గానికి మాల్దీవులు సమీపంలోనే ఉన్నాయి. మాల్దీవులు చిన్న దేశం కావడంతో భారత్‌ ఎక్కువగా సాయం చేసింది. మాల్దీవులు అన్ని రకాలుగా భారత్‌పై ఆధారపడుతుంది. ఆ దేశ పర్యాటకుల్లో ఎక్కువ భాగం భారతీయులే. మాల్దీవులకు చెందిన వేలాది మంది ప్రజలు భారత్‌కు వచ్చి ఉపాధి పొందుతున్నారు. మొన్నటి దాకా అధికారంలో ఉన్న ఇబ్రహీం సోలిహ్‌ సైతం భారత్‌తో సన్నిహిత సంబంధాలకు కృషి చేశారు.  గతంలో యామీన్‌ అధికారంలో ఉన్న సమయంలో మాల్దీవులకు ఉదారంగా రుణాలిచ్చి కొన్ని దీవుల్లో  పాగా వేసేందుకు యత్నించింది. అయితే కొంత కాలం తరువాత జరిగిన ఎన్నికల్లో యామీన్‌ ఓడిపోవడంతో చైనా పన్నాగాలు ఫలించలేదు. తాజాగా మళ్లీ యామీన్‌ సన్నిహితుడు అధికారంలో రావడంతో డ్రాగన్‌ తన పన్నాగాలను అమలుచేసే అవకాశముంది. మాల్దీవుల్లో చైనా ఎలాంటి చర్యలకు పాల్పడినా భారత భద్రతపై పెను ప్రమాదం చూపించే అవకాశముంది.