Most Unique Tree In The World: మనిషి పుట్టుక కంటే ఎన్నో వేల సంవత్సరాలకు ముందు నుంచే చెట్లు ఉన్నాయని తలుచుకుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. రకరకాల ఆకారాల్లో, రంగుల్లో రూపాల్లో ప్రకృతి ఉల్లాసపరుస్తుంది. ఎన్నో వందల సంవత్సరాలుగా జీవంతో ఉండి, నీడను, పూలను, పండ్లను, ఔషధాలను ఇవ్వటమే కాకుండా కొన్ని చెట్లతో ముడిపడివున్న ఫెయిరీ టేల్స్ లాంటి కథలు అబ్బురపరుస్తున్నాయి. ఆ విచిత్రాలేమిటో చదివేయండి.


జపనీస్ మేపుల్ (Japanese Maple):


విచిత్రమైన వంపులు తిరిగి ఉండే ఈ చెట్లు జపన్ కు,  చెందినవి. రష్యా, మంగోలియా, చైనా, కొరియాలో కూడా ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ఆకులు చేతి ఆకారంలో ఉండటం వీటి ప్రత్యేకత.అంటుకట్టే పద్ధతి వల్ల ఈ చెట్లు ఇపుడు రకరకాల వేరియేషన్లతో కూడా కనపడుతున్నాయి.



ఏంజెల్ ఓక్ ట్రీ (Angel Oak Tree):


సౌత్ కారొలీనాలో కనపడే ఈ చెట్లు 600 ఏళ్ల వరకు బతుకుతాయి. అయినా ఇవి ఎంతో పచ్చగా ఎప్పటికపుడూ కొత్తగా చిగురిస్తూ ఉండటంతో చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఈ చెట్టు ఊడలను పట్టుకొని ఏంజెల్స్ ఉంటాయని, ఇక్కడ ఏంజెల్స్ ని ఎంతోమంది చూసినట్టు చెప్తుంటారు. అందుకే దీన్ని ఏంజెల్ ఓక్ ట్రీ అని పిలుస్తున్నారు.



డెడ్ మార్ష్ (Dead Marsh):


నమీబియాలోని డెడ్ వ్లీ అనే ఒక అడవి చాలా ఏళ్ల క్రితం ఇసుక దిబ్బల మధ్య బంధీ అయిపోయింది. అక్కడి వన్యప్రాణులను, చెట్లను రక్షించడానికా అన్నట్లు కొన్నాళ్లకు ఒక నది ప్రవహించింది. సుమారు 900 ఏళ్ల క్రితం వాతావరణం క్షీణించి, ఇసుక దిబ్బలు చెట్లన్నింటినీ కత్తిరించేసాయి. చెట్లు కనీసం పూర్తిగా విరిగిపోయి, డీకంపోజ్ కూడా అవలేనంత పొడిబారిపోయింది ఆ ప్రాంతం. అందుకని ఎండిపోయిన ఆ చెట్లు ఇప్పటికీ వందల యేళ్లుగా నిలబడి ఉన్నాయి. విచిత్రమే కదా!



డ్రాగన్ బ్లడ్ ట్రీ (Dragon Blood Tree):


యెమెన్ దేశంలోని సోకోట్రా అనే ప్రాంతంలో ఒక వింత జాతి చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు లోపలి నుంచి రక్తంలాంటి ద్రవం వస్తుంటుంది. చిక్కటి ఎరుపు రంగులోని ఈ ద్రవం చెట్టు నుంచి రక్తం కారుతున్నట్టే కనిపించటం వల్ల ఈ చెట్టును డ్రాగన్ బ్లడ్ ట్రీ అని పిలుస్తున్నారు. కొంతమంది ఇది నిజంగా డ్రాగన్ల రక్తమేనని నమ్ముతున్నారు. తాంత్రిక పూజలకు కూడా ఈ ద్రవాన్ని రక్తంగా వాడుతారట!



మేతుసేలా(Methuselah Tree)


మేతుసేలా..ఈ చెట్టు వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్షరాలా..4,852 ఏళ్లు. దీన్ని గ్రేట్ బ్రిస్టల్ కోన్ పైన్ అంటారు. ఇది కాలిఫోర్నియాలో ఉంది. ఇది ప్రపంచంలో అతి పురాతన చెట్టు. మరొక విషయమేమిటంటే..ఇది వేరే చెట్టు నుంచి క్లోన్ చేసినది కాదు. అంటే ఇదే మాతృ వృక్షం. 



తరచి చూస్తే ప్రకృతిలో ఎన్ని అద్భుతాలో కదూ! రిచర్డ్ పవర్స్ అనే ఒక రచయిత తన పుస్తకంలో చెట్ల గురించి మాట్లాడుతూ.. "మన ప్రపంచంలో చెట్లు లేవు..చెట్లున్న ప్రపంచానికే మనుషులు వచ్చారు". ఎంత నిజమో కదా! వాటి ప్రపంచంలోకి మధ్యలో మనుషులు వచ్చి వాటినే నరికేసి విధ్వసం సృష్టించటం వల్లే ఇంత ప్రశాంతమైన ప్రకృతీ గ్లోబల్ వార్మింగ్ వంటి చర్యల ద్వారా ప్రకోపిస్తుంది. అందుకని చెట్లను, అడవులనూ కాపాడుకోవటానికి మన వంతు కృషి చేయాలి. వృక్షో రక్షతి రక్షితః