Potatoes Cost: ఆహార పదార్థాల ధరలు ఒక్కోసారి ఆకాశాన్ని అంటుతాయి. ఎండాకాలంలో, వర్షాలు భారీగా పడి పంటలు నాశనం అయిన సందర్భాల్లో ఉల్లి, ఆలు, టమాటా, పప్పుల ధరలు భారీగా పెరుగుతాయి. 30, 40 రూపాయలు ఉన్న కూరగాయల ధరలు కూడా రూ.100 నుంచి రూ.150 అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే 150 రూపాయలకు పెరిగితే ఆకాశాన్ని తాకాయని అనుకుంటే ఒకవేళ వాటి ధర 40 వేలు, 50 వేలు అయితే ఏమనాలి. అప్పుడు ఆకాశాన్ని తాకుతున్న ధరలు అని కాకుండా రోదసిని, సూర్య మండలాన్ని తాకుతున్న ధరలు అని అనుకోవాలేమో. అలా సూర్య మండలాన్ని తాకుతున్నాయి బంగాళాదుంపల ధరలు. అయితే ఇది మనదగ్గర కాదు. ఫ్రాన్స్ సమీపంలోని ఓ ద్వీపంలో ఆలుగడ్డల ధర ఏకంగా రూ. 40 వేల నుండి రూ. 50 వేల పలుకుతున్నాయి. ఫ్రాన్స్ లోని నోయిర్ మౌటియర్ ద్వీపం(Noirmoutier) ఈ అత్యంత భారీ ధర కలిగిన ఆలుగడ్డలు దొరుకుతాయి. వీటి ప్రత్యేకత వల్లే వీటికి ఇవి అంతటి ధర పలుకుతాయి. 


ఏడాదిలో కేవలం పది రోజులు మాత్రమే అందుబాటులో ఉండే ఆలూ


ఈ బంగాళాదుంపల పేరు లే బోనోట్(Le Bonnotte). ఇవి ప్రంపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంపలు. ఇవి కేవలం ఫ్రాన్స్ లోని నోయిర్ మౌటియర్ ద్వీపంలోనే మాత్రమే లభిస్తాయి. ఈ రకం బంగాళాదుంపలు ఏడాదిలో కేవలం 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీటి సాగు ప్రత్యేకత వల్లే వీటి ఖరీదు ఆ రేంజ్ లో ఉంది. మామూలుగా ఆలుగడ్డలను నీళ్లు, రసాయన ఎరువులు లేదా గోమూత్ర, పేడతో కలిపి తయారు చేసే ఎరువులు వాడి ఆలుగడ్డలను పెంచుతారు. ఈ లే బోనోట్ రకం బంగాళాదుంపలను సముద్రపు పాచి, ఆల్గేను సహజ ఎరువులుగా ఉపయోగించి సాగు చేస్తారు. నోయిర్ మౌటియర్ ద్వీపంలో కేవలం 50 చదరపు మీటర్ల ఇసుక భూమిలోనే వీటిని సాగు చేస్తారు. ఈ బంగాళ దుంపలో రుచిలో కాస్త భిన్నంగా ఉంటాయి. సముద్రాల నుండి తీసిన ఎరువులతో వీటిని సాగు చేయడం వల్ల రుచిలో కాస్త భిన్నంగా ఉంటాయి. సాధారణ ఆలుగడ్డలతో పోలిస్తే ఈ రకం ఆలుగడ్డలు కాస్త పుల్లగా, ఉప్పగా ఉంటాయి. ఈ లే బోనోట్ రకం బంగాళా దుంపలను అక్కడి ప్రజలు మనలా కూరలు వండుకోవడానికి ఉపయోగించరు. సలాడ్లు, సూప్ లను తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. 


ఇంత అతి భారీ ధర కలిగి ఈ రకం ఆలుగడ్డల్లో పోషకాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. సాధారణ ఆలు గడ్డలతో పోలిస్తే వీటిలో ఉండే పోషకాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయట. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చాలా రోగాల నుండి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలుగడ్డలకు స్థానికంగా చాలా గిరాకీ ఉంటుంది. కోతల సమయంలోనూ ఎలాంటి పనిముట్లు వాడకుండా చేతులతో పంటను సేకరిస్తారు. పూర్తిగా మనుషులే వాటిని సేకరించి, శుభ్రం చేసి అమ్మకానికి పెడతారు.