Iraq Fire Accident:
ఘోర ప్రమాదం..
ఇరాక్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 100 మంది ప్రాణాలు కోల్పోగా...150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్‌లోని Nineveh ప్రావిన్స్‌లో పెళ్లి జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే...పెద్ద ఎత్తున బాణసంచా పేల్చడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉన్నట్టుండి మంటలు ఎగిసిపడి బిల్డింగ్ అంతా అంటుకున్నాయి.
ఆ బిల్డింగ్ కూడా పాతది కావడం వల్ల మంటలు అంటుకున్న వెంటనే పూర్తిగా ధ్వంసమైందని స్థానికులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు ఉన్న చోట సీలింగ్ ఫ్యాన్ ముక్కలు ముక్కలై పడిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందగానే అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. సహాయక చర్యలు మొదలు పెట్టింది. అయితే...మంటలు ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం..ఈ పెళ్లి వేడుకకు వందలాది మంది హాజరయ్యారు. ఈ కారణంగానే మృతుల సంఖ్య 100కి చేరుకుంది. మంటలు ఎగిసిపడగానే ఎటు పడితే అటు అందరూ పరుగులు పెట్టారు. తప్పించుకున్న వాళ్లు తప్పించుకున్నారు. కానీ కొందరు మాత్రం ఆ మంటలకు ఆహుతయ్యారు. ఆంబులెన్స్‌లు, మెడికల్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వీలైనంత వేగంగా సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుదానీ ( Mohammed Shia al-Sudani) వెల్లడించారు.