MIT research shows Chat GPT Effect on brain : ప్రస్తుతం అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. తాము చేసే పనుల్లో వాటిని ఉపయోగిస్తున్నారు. చాట్ జీపీటీ , గ్రోక్ వంటివి ఉపయోగిస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మానవాళికి ఎంత మేలు చేస్తుందో .. అంత కంటే ఎక్కువ కీడు చేస్తుందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో తేలింది. చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించడం వల్ల విద్యార్థుల మెదడు ఆలోచించడం తగ్గుతుందని, దీర్ఘకాలికంగా క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, జ్ఞాపకశక్తి బలహీనపడే అవకాశం ఉందని పరిశోధన తేల్చింది.
వివిధ వయసుల్లో ఉన్న వారిని మూడు గ్రూపులుగా చేసి ఎంఐటీ శాస్త్రవేత్తల పరిశోధన
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు 18 నుండి 39 సంవత్సరాల వయస్సు గల 54 మందిని మూడు గ్రూపులుగా విభజించాచు. వీరిలో ఓ గ్రూపును చాట్ జీపీటీని ఉపయోగించి వ్యాసాలు రాయమన్నారు. మరో గ్రూప్ ను గూగుల్ వంటివి ఉపయోగించుకుని వ్యాసాలు రాయమన్నారు. మూడో గ్రూపును సొంతంగా తమ నాలెడ్జ్ ఉపయోగించుకుని వ్యాసాలు రాయమన్నారు. ఇలా రాసినప్పుడు వారి బ్రెయిన్ ను పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసి కదలికల్ని గుర్తించేదుకు ఏర్పాట్లు చేశారు. వారు రాసిన తర్వాత ఫలితాలను విశ్లేషించారు.
చాట్ జీపీటీ వాడే వారిలో మొదడు కణాలు పని చేయడం తక్కువ !
ఆ ఫలితాల్లో చాట్‌జీపీటీ వినియోగదారుల మెదడు కదలికల్లో అతి తక్కువ న్యూరల్ కనెక్టివిటీ ఉన్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి, శ్రద్ధ, క్రియేటివ్ ఆలోచనకు సంబంధించిన నాడుల్లో కదలిక లేదు. అదే సమయంలో సెర్చ్ ఇంజిన్ వినియోగించిన వారు మెదడులో కాస్త కదలిక ఉంది. గూగుల్ వినియోగదారులు సమాచారాన్ని వెతకడం,విశ్లేషించడం వంటివి చేస్తారు. అయితే ఎటువంటి సాధనాలు లేని వారు అత్యధిక న్యూరల్ కనెక్టివిటీని చూపించారు. అదే సమయంలో చాట్ జీపీటీ ఉపయోగించిన వారు దాదాపుగా ఒకే రకమైన వ్యాసాలు రాశారు. సెర్చ్ ఇంజన్ , బ్రెయిన్-ఓన్లీ గ్రూప్‌లలో కేవలం 10-11 శాతం మంది మాత్రమే ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. చాట్ జీపీటీ ఉపపయోగించి రాసిన వారి వ్యాసాల్లో సోల్ లేదని .. వాటిని ఎసెస్ చేసిన ఉపాధ్యాయులు తేల్చారు.
త్వరగా పని చేయవచ్చు కానీ.. ఫలితం ఉండదు!
చాట్‌జీపీటీ వంటి AI సాధనాలు త్వరగా పని చేయడానికి ఉపయోగపడతాయి. కానీ డీప్ లెర్నింగ్, క్రిటికల్ థింకింగ్‌ను అడ్డుకుంటాయి. పిల్లల మెదడును ఇవి ఎదగకుండా చేస్తున్నాయి. అంటే MIT అధ్యయనం చాట్‌జీపీటీ వంటి AI సాధనాలు స్వల్పకాలిక సౌలభ్యాన్ని అందిస్తాయని, కానీ దీర్ఘకాలికంగా మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్‌ను క్షీణింపజేస్తాయని స్పష్టంగా చూపిస్తుంది. అందుకే చాట్ జీపీటీ లాంటి ఏఐ సిస్టమ్స్ ను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటికి అలవాటు పడకుండా.. ఏదైనా సొంతంగా పని చేసుకుంటేనే మంచిది.