రాజకీయ నాయకులు, ప్రముఖులు నోరు జారుతుండడం చాలా సాధారణమైన విషయం. ముందూ వెనకా ఆలోచించకుండా కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసేస్తుంటారు. వాటివల్ల జనం నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయితే క్షమాపణలు చెప్పడం, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించడం వంటివి చేసిన వారూ ఉన్నారు. కీలకమైన ప్రసంగాల కోసం ఎంతగా ప్రిపేర్ అయినా ఏక్కడో ఓ చోట పొరపాటు చేస్తుంటారు. ఇందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మినహాయింపు ఏమీ కాదు. ఆయన కూడా గతంలో చాలా సార్లు బహిరంగంగా మాట్లాడినప్పుడు పొరపాట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన కీలక ప్రసంగం చేస్తున్నప్పుడు నోరు జారారు. 


అమెరికన్ కాంగ్రెస్‌లో రష్యా - ఉక్రెయిన్ సమస్య గురించి మాట్లాడుతూ ఏకంగా దేశం పేరు మార్చేశారు. ఉక్రెయిన్ అనేందుకు బదులుగా ఇరాన్ అనేశారు. ‘ఉక్రేనియన్ ప్రజలు’ అనాల్సిన చోట ‘ఇరానియన్ ప్రజలు’ అన్నారు. ‘‘పుతిన్ కీవ్ నగరాన్ని యుద్ధ ట్యాంకులు, శతఘ్నులతో చుట్టుముట్టవచ్చు. కానీ, ఇరానియన్ ప్రజల మనసులు మాత్రం గెల్చుకోలేరు’’ అని బైడెన్ అన్నారు. ఇక ఈ వీడియో ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిపోయింది. 


జో బైడెన్ ఇలా నోరు జారడం ఇదేం మొదటి సారి కాదు. చిన్న తనంలో ఆయనకు నత్తి ఉండేది. అప్పట్లో మాట్లాడడం కష్టమయ్యేది. కానీ, రోజూ గంటల తరబడి నిరంతర సాధన, శ్రమ ఫలితంగా ఆయన తన ప్రసంగ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకున్నారు. పోయిన సంవత్సరం కూడా ఇదే తరహాలో పొరపాటున నోరు జారారు. యూస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ గురించి చెప్తూ.. ‘ప్రెసిడెంట్ హ్యారిస్’ అనేశారు.






రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు: బైడెన్


ఉక్రెయిన్‌పై దాడుల విషయంలో వెనక్కి తగ్గని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు (Vladimir Putin) అమెరికా గట్టి హెచ్చరికలు చేసింది. రష్యాకు చెందిన బిలియనీర్ల లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ప్రైవేటు జెట్లను సీజ్ చేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఈ సందర్భంగా చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు (Ukraine Russia War) ఆపకపోతే ఆ దేశం తీవ్రమైన ఆర్థికపర ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఉక్రెయిన్‌పై దాడి విషయంలో ప్రపంచమంతా పుతిన్‌నే బాధ్యుడిగా చూస్తోందని అన్నారు. యూరోపియన్ యూనియన్‌లోని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, కెనడా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి మొత్తం 27 సభ్య దేశాలు కూడా పుతిన్ చర్యను తప్పుబడుతున్నాయని గుర్తు చేశారు. ఆఖరికి స్విట్జర్లాండ్ కూడా ఉక్రెయిన్‌కు మద్దతు పలుకుతూ రష్యాపై ఒత్తిడి కలిగిస్తోందని అన్నారు.