Irans Supreme Leader moved to secure location: హెజ్బొల్లా అధినేత హసన్ నస్రుల్లా మరణంతో మధ్య ప్రాశ్చ్యం భగ్గుమంటోంది. ఇరాన్ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. నస్రుల్లా తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలి ఖమేనీ ఇజ్రాయెల్‌కు తదుపరి లక్ష్యం అయ్యే అవకాశం ఉందన్న వార్తల మధ్య ఆయన్ను హై సెక్యూరిటీ మధ్య సురక్షితమైన రహస్య ప్రాంతానికి తరలించినట్లు రాయిటర్స్‌ తెలిపింది. లెబనాన్‌లోని సామాన్యులపై దాడుల ద్వారా ఇజ్రాయెల్‌ మరో సారి తమ క్రూరమైన జియోనిస్ట్ తత్త్వాన్ని ప్రపంచానికి చాటుకుందని ఖమేనీ ట్వీట్ చేశారు.


ఇజ్రాయెల్‌కు హమాస్‌, హెజ్బొల్లా తర్వాతి లక్ష్యం ఇరాన్ సుప్రీం లీడరేనా?


 లెబనాన్ రాజధాని బైరూట్‌లో హెజ్బొల్లా నేతలు, కమాండర్లే లక్ష్యంగా వారం రోజులుగా వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ తమ లక్ష్యాన్ని అందుకుంది. హెజ్బొల్లా అధినేత హసన్ నస్రుల్లాను మట్టుపెట్టింది. బైరూట్‌లో ఓ భవనంలో నస్రుల్లా ఉన్నారన్న స్పష్టమైన సమాచారంతో దాడులు జరిపిన ఇజ్రాయెల్ దళాలు నస్రుల్లాను చంపాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌ ఏడీఎఫ్ ప్రకటన చేసింది. శుక్రవారం నాడు బైరూట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంలో జరిగిన మీటింగ్‌లో నస్రుల్లా పాల్గొన్న సమయంలో తాము దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హెజ్బొల్లా తమ లీడర్ సురక్షిత ప్రాంతంలో ఉన్నాడని అతడు మరణించ లేదని హెజ్బొల్లా చెబుతున్నప్పటికీ మధ్యప్రాశ్చ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు నస్రుల్లా మరణాన్ని ధ్రువీకరిస్తున్నాయి.


ఇజ్రాయెల్ శుక్రవారం నాడు 140 వరకు హెజ్బొల్లా టార్గెట్స్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇకపై నస్రుల్లా తన ఉగ్రవాదంతో ప్రపంచాన్ని భయపెట్టలేడని వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ వార్ రూమ్ కూడా ఆపరేషన్ న్యూ ఆర్డర్ మిషన్ విజయవంతం అయినట్లు ప్రకటించింది. గత వారం లెబనాన్‌ వ్యాప్తంగా పేజర్ పేలుళ్లు,  వాకీటాకీల పేలుళ్లతో హెజ్బొల్లాపై మొదలైన దాడులు ఈ వారం మొదటి నుంచి నేరుగా ఇజ్రాయెల్ వైమానిక దళాలు రంగంలోకి దిగడంతో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకూ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 700 మందికిపైగా మరణించారు. వేల మంది గాయపడ్డారు. దక్షిణ లెబనాన్ నుంచి లక్షన్నర మంది వరకూ సురక్షిత ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లి పోయారు. గాజా దాడుల తర్వాత లెబనాన్‌లోని హెజ్బొల్లాపై దాడులు జరిపిన ఇజ్రాయెల్‌.. తమ తదుపరి లక్ష్యంగా ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఎంచుకున్నట్లు మధ్యప్రాశ్చ్యంలో అనుమానాలు బయలు దేరాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది.


నస్రుల్లా మరణంతో మధ్య ప్రాశ్చ్యంలో ఉద్రిక్త పరిస్థితులు:


హెజ్బొల్లా అధినేత హసన్‌ నస్రుల్లా మరణంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్క సారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. తమ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని దేశంలోనే సురక్షిత ప్రాంతానికి హై సెక్యూరిటీ మధ్య తరలించారు. దానికి ముందు ఆయన తన నివాసంలో సెక్యూరిటీ రివ్యూ చేశారు. కమాండర్లు చనిపోయినంత మాత్రాన హెజ్బొల్లా బలహీనపడదని ఖమేనీ వ్యాఖ్యానించారు. లెబనాన్‌లో నిరాయుధులైన సామాన్య పౌరులపై బాంబుల వర్షం కురిపించడం ద్వారా తన క్రూరత్వాన్ని జియోనిస్ట్‌లు మరోసారి బయట పెట్టుకున్నారని ఖమేనీ విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు లెబనాన్‌లో పక్షాన నిలవాలని ఖమేనీ సూచించారు. నస్రుల్లా మరణ వార్తల తర్వాత ఇరాన్ ఆ ప్రాంతంలో ఉన్న ప్రాక్సీ గ్రూప్‌లతో పాటు తమ మిత్ర దేశాలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ పరిస్థితిని అంచనా వేస్తూ వస్తోంది.






అటు.. యూఎన్‌జీఏలో రెండు మ్యాప్‌లు ప్రదర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ అందులో ఒక దానికి శాపంగా మరో దానికి వరంగా పేరు పెట్టారు. శాపంగా పేర్కొన్న మ్యాప్‌ నల్ల రంగులో ఉండగా అందులో పాలస్తీనాను అసలు చూపలేదు. ఇరాన్‌, లెబనాన్‌, సిరియా, యెమెన్‌ దేశాలను నల్ల మ్యాపులో చూపించి వీటిని మధ్యప్రాశ్చ్యానికి శాపంగా పేర్కొన్నారు. పచ్చటి మ్యాప్‌లో భారత్ సహా సౌదీ అరేబియా, సూడాన్ వంటి దేశాలను చూపించారు. పచ్చటి మ్యాపులో ఉన్న దేశాల్లో కొన్నింటితో ఇజ్రాయెల్‌ ప్రస్తుతానికి ఏ విధమైన సంబంధాలు కలిగి లేదు. అయితే భవిష్యత్‌లో వాటికి స్నేహహస్తం చాచేందుకు నెతన్యాహూ ఇలా చేస్తున్నట్లు అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Also Read: Low Cost Airlines: తక్కువ ఖర్చుతో ఎయిర్‌లైన్ సర్వీసులు- భారతీయ విమానయానంలో సరికొత్త అధ్యాయం