Israel State of War: 


యుద్ధ వాతావరణం..


ఇజ్రాయేల్‌ బాంబుల మోతతో ఉలిక్కి పడింది. గాజా (Gaza Strip) నుంచి పాలెస్తీనియన్ మిలిటెంట్‌లు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. రాకెట్‌లతో విరుచు పడుతున్నారు. ఈ దాడులతో ఇజ్రాయేల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గాజా సరిహద్దు వద్ద 80 కిలోమీటర్ల పరిధి వరకూ ఎమర్జెన్సీ ప్రకటించింది. "State of War"గా డిక్లేర్ చేసింది. ఉగ్రదాడులను తిప్పి కొట్టేందుకు "Operation Iron Swords" ని లాంఛ్ చేసింది. ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. ఫైటర్ జెట్స్‌ని సిద్ధం చేసుకున్నాయి. గాజా స్ట్రిప్‌ వద్ద నక్కి ఉన్న ఉగ్రవాదులపై దాడులు మొదలు పెట్టాయి. 






పదుల సంఖ్యలో రాకెట్‌లను ఇజ్రాయేల్‌పైకి పంపుతున్నారు హమాస్ ఉగ్రవాదులు (Hamas Militants). పౌరులందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఈ దాడుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇజ్రాయేల్ భూభాగంలోకి కొందరు ఉగ్రవాదులు అక్రమంగా చొరబడ్డారని ప్రకటించింది. గాజా సరిహద్దు ప్రాంతంలో దాడులకు తెగబడుతున్నారని వెల్లడించింది. ఈ రాకెట్ దాడుల మోత జెరూసలేం వరకూ వినిపిస్తోందని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ దాడులకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటి అథెంటిసిటీ గురించి స్పష్టత లేకపోయినా...చాలా మంది వీటిని షేర్ చేస్తున్నారు. చాలా చోట్ల కాల్పులు కూడా జరుగుతున్నాయి. గాజా పరిసర ప్రాంతాల్లో రాకెట్‌ దాడుల శబ్దం మారు మోగుతోంది. అటు టెల్ అవీవ్‌లోనూ సైరన్‌ల మోత మోగుతోంది. దాదాపు అరగంట పాటు ప్రజలు గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడిపారు. రాకెట్ దాడిలో ఓ 70 ఏళ్ల వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. చికిత్స అందించేలోగా  ప్రాణాలు కోల్పోయింది. మరో 20 ఏళ్ల వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. 






హమాస్ సంచలన ప్రకటన..


అటు ఉగ్రసంస్థ హమాస్ సంచలన ప్రకటన చేసింది. "చరిత్రలో గుర్తుండిపోయే ఆక్రమణకు సిద్ధంగా ఉండండి" అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇజ్రాయేల్‌తో యుద్ధం ప్రకటించింది. మొత్తం 5 వేల రాకెట్లను ఇజ్రాయేల్ వైపు పంపనున్నట్టు చెప్పింది. దీనికి “Operation Al-Aqsa Storm”గా పేరు పెట్టింది. ఇప్పటి వరకూ జరిగింది చాలని, ఇకపై సహించేది లేదని తేల్చి చెప్పింది. ఇజ్రాయేల్ ప్రభుత్వం చాలా సార్లు హమాస్ లీడర్ మహమ్మద్ డీఫ్‌ని (Mohammed Deif) హతమార్చేందుకు ప్రయత్నించింది. కానీ అది కుదరలేదు. అప్పటి నుంచి ఇజ్రాయేల్‌పై దాడికి ప్లాన్ చేస్తున్నాడు డీఫ్. ఇప్పుడు ఉన్నట్టుండి దాడులు మొదలు పెట్టాడు. యుద్ధం ప్రకటించాడు. వేలాది సంఖ్యలో రాకెట్‌లతో హమాస్ ఉగ్రవాదులు దడ పుట్టిస్తున్నారు.