వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా సైన్యం వరుస దాడులు చేసుకుంటూ బీభత్సం సృష్టిస్తున్నాయి. వరుసగా 13 రోజుల పాటు జరిగిన అమెరికా దాడుల తర్వాత ఇరాన్‌పై కొత్త సైనిక దాడులను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు, వాటిలో దౌత్యపరమైన ప్రయత్నాలకు అవకాశం ఇవ్వడం, అమెరికా మిస్సైల్ రక్షణ నిల్వలు తగ్గిపోవడంపై ట్రంప్ ఆందోళన, యుద్ధం మరింత పెరిగే ప్రమాదం ఉన్నాయని అమెరికాలోని పలు మీడియా సంస్థల నివేదించాయి.
ట్రంప్ తాజా నిర్ణయం ప్రకారం, సుమారు రెండు వారాలుగా జరుగుతున్న రోజువారీ అమెరికా దాడులకు మొదటిసారిగా బ్రేక్ లభించింది. అమెరికా సైన్యానికి కొత్త అటాక్ ప్లాన్స్ ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఎటువంటి కొత్త దాడి చేయవద్దని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించినట్లు ఎక్సియోస్ నివేదిక పేర్కొంది. ట్రంప్ నిర్ణయాన్ని చర్చలు, దౌత్యపరమైన పరిష్కారం దిశగా వేసిన ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
సైనిక చర్యను తిరిగి ప్రారంభించవచ్చు - అమెరికా
అవసరమైతే సైనిక చర్యను తిరిగి ప్రారంభించవచ్చని అమెరికా స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై వైట్‌హౌస్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు, కానీ వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెయుంగ్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎల్లప్పుడూ దౌత్యపరమైన పరిష్కారాలకు మద్దతు ఇస్తారని తెలిపారు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైన్యం కార్యకలాపాలను పెంచినా లేదా అమెరికా మిత్రదేశాలపై చర్యలు తీసుకున్నా, సరికొత్త దాడులకు ప్లాన్స్ అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు.
పెద్ద యుద్ధం చెలరేగవచ్చు - డొనాల్డ్ ట్రంప్
నివేదిక ప్రకారం, ప్రస్తుత స్థాయి సైనిక చర్య, అని ఇలాగే దాడులు కొనసాగితే తీవ్రత మరో స్థాయికి చేరుకుంటుందని ట్రంప్ భావిస్తున్నారు. దాడులలో ముందుకు వెళితే పెద్ద యుద్ధం చెలరేగవచ్చు అని, చర్చలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ట్రంప్ కోరుకుంటున్నారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి, కానీ చర్చలు విఫలమైతే సాధ్యమైనంత త్వరగా సైనిక చర్యను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని కూడా కొనసాగించాలని ఆయన కోరుకున్నారు. ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉంది. కానీ ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవడం మరింత సులువైన మార్గం అనిపిస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, కాలక్రమేణా ఇరాన్ కూడా చర్చల పట్ల మరింత తీవ్రంగా ఆలోచిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
పటిష్ట అమెరికా రక్షణ వ్యవస్థ
ఈ నిర్ణయం వెనుక అమెరికా రక్షణ వ్యవస్థలో పెరుగుతున్న ఆందోళన కూడా కారణమని చెబుతున్నారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, సీనియర్ సైనిక అధికారులు అధ్యక్షుడ్ని తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌ను మరింత పెంచితే అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ప్యాట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థలు త్వనగా ఉపయోగించాల్సి వస్తుందని నివేదిక పేర్కొంది. ఇరాన్‌తో సంఘర్షణ దీర్ఘకాలం కొనసాగితే మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా సైనికులు, సైనిక స్థావరాలు, మిత్రదేశాల భద్రత ప్రభావితం కావచ్చు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ ట్రంప్‌తో ఈ విషయంపై చర్చించారు. అమెరికా సైన్యం పెద్ద దాడులు చేసేందుకు వెనుకాడదు. కానీ ఇది క్షిపణి రక్షణ నిల్వలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ట్రంప్ గుర్తించారు. ఇటీవల కాలంలో అమెరికా ఇప్పటికే 1,200 కంటే ఎక్కువ ప్యాట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ప్రయోగించింది. దీనివల్ల రక్షణ నిల్వలపై ఒత్తిడి పెరిగింది. ఆ కారణంతోనే దాడులకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
