Iran-US Conflict: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ మధ్య మంగళవారం ఒక చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పంద కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌పై భారీ బాంబు దాడులు చేస్తామని ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించిన వేళ ఆ ఒప్పందం ఒక ఊరటగా నిలిచింది. అయితే ఈ ఒప్పంద అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే అంటే బుధవారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం పది గంటలకు ఇరాన్‌లోని లావన్ ద్వీపంలో చమురు శుద్ధి కర్మాగారంపై శత్రు దేశం దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. 

Continues below advertisement

నేషనల్ ఇరానియన్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది , భద్రతా బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. నాసా శాటిలైట్ చిత్రాలు కూడా లావన్ ద్వీపంలో మంటలు చెలరేగినట్టు ధ్రువీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి ఉండగానే ఈ దాడి జరగడం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. దీంతోపాటు ఇరాన్ కూడా కువైట్,యూఏఈ వంటి గల్ఫ్ అరబ్‌ దేశాలపై దాడులు చేసినట్టు నివేదికలు అందుతున్నాయి. 

ఒప్పందంలోని ముఖ్యాంశాలు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఈ ఒప్పందాన్ని వాషింగ్టన్‌ సాధించిన సంపూర్ణ విజయంగా అభివర్ణించారు. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే సురక్షితంగా తెరిచేందుకు అంగీకరించింది. అమెరికా రెండు వారాల పాటు ఇరాన్‌పై ఎటువంటి దాడులు చేయదు. ఒప్పందం కాలంలో ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియంను సురక్షితంగా పర్యవేక్షించేలా ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. 

Continues below advertisement

వివాదానికి అసలు కారణం ఏంటీ?

ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై సైనిక చర్యను సమర్థిస్తూ, ఇరాన్‌ అణ్వాయుధ తయారీ కోసమే యురేనియంను సుసంపన్నం చేస్తోందని ఆరోపించింది. అయితే ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షక సంస్థ ఈ ఆరోపణలను ఇంకా ధృవీకరించలేదు. ఇరాన్ కూడా దీనిని ఖండిస్తూనే ఉంది. గతంలో అమెరికా పెట్టిన కఠిన నిబంధనలను అంటే క్షిపణి కార్యక్రమం నిలిపివేత, ఉగ్రవాద సంస్థలకు మద్ధతు ఉపసంహరణ వంటివి ప్రస్తుత తాత్కాలిక ఒప్పందంలో పేర్కొనలేదు. 

ఈ శాంతి చర్చల్లో పాకిస్తాన్ కీలక మధ్యవర్తిగా వ్యవహరించింది. అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండూ పాకిస్తాన్‌పై నమ్మకం ఉంచడం ఈ ఒప్పందాన్ని మార్గం సుగమం చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇరాన్ నాయకుడు అయతుల్లా ఖమేనీ కుమారు ముజ్తబా ఖమేనీ కూడా ఈ ఒప్పందాన్ని కుదర్చడంలో తెరవెనుక కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. 

ఒకవైపు కాల్పుల విరమణను ఇరాన్ వేడుకగా జరుపుకుంటున్నా, అమెరకా, ఇజ్రాయెల్ చర్యల పట్ల అక్కడ తీవ్ర అపనమ్మకం కొనసాగుతోంది. బిలియనీర్ పెట్టుబడిదారు రే డాలియో వంటి వారి ఈ ఘర్షణలను ప్రపంచయుద్ధంగా అభివర్ణిస్తూ ఈ పరిస్థితిలో చైనా, రష్యాలే విజేతలుగా నిలిచారని వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతానికి హర్మూజ్ జలసంధి తెరుచుకోవడం వల్ల ప్రపంచ చమురు ధరలు కొంత స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ, లావన్ ద్వీపంపై జరిగిన దాడి ఈ శాంతిని ఎంత కాలం నిలబెడుతుందనేది వేచి చూడాలి. ట్రంప్‌ తన వ్యూహాన్ని నిరంతరం మారుస్తూనే ఉన్నారు. గత నెలలో నిస్సందేహమైన లొంగుబాటు కావాలన్న ఆయన, ఇప్పుడు రెండు వారాల కాల్పుల విరమణ అంగీకరించారు.