Iran War: పశ్చిమాసియాలో నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్, ట్రంప్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకవైపు యుద్ధ విరమణ ప్రకటించాలని ఇరాన్ రిక్వస్ట్ చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తే, ఆ వార్తలను టెహ్రాన్ ఖండించింది. ప్రపంచాన్ని ట్రంప్ ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని సెటైర్లు వేస్తోంది.
ఇరాన్ ప్రాధేయపడుతుందన్న ట్రంప్
బుధవారం నాడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌సోషల్‌లో డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్టు పెట్టారు. ఇరాన్‌లోని కొత్త పాలన ప్రతినిధి యుద్ధ విరమణ ప్రతిపాదన తమ వద్ద ఉంచారని తెలిపారు. ఈ కొత్త అధ్యక్షుడికి గత నేతల కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని తీవ్రవాద ధోరణి తక్కువగా ఉందని కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు సీజ్‌ఫైర్ అంత ఈజీ కాదని ట్రంప్ షరతులు పెట్టినట్టు చెప్పారు. ప్రపంచ క్రూడ్ ఆయిల్ వ్యాపారానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిని తక్షణమే పూర్తి స్థాయిలో తెరవాలని డిమాండ్ చేశారు. ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాలని చెప్పారు. ఈ షరతులకు అంగీకరిస్తే యుద్ధ విరమణ గురించి ఆలోచిస్తామన్నారు. అంతేకాకుండా ఈ షరతులకు ఒప్పుకోకపోయినా ఇరాన్‌ను నామరూపాలు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాతియుగంలో ఎలా ఉండేదో ఆ దేశాన్ని అలా చేస్తామని అన్నారు.
ఏప్రిల్ పూల్ అంటూ ఇరాన్ ఘాటు స్పందన
ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వం మండిపడింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో... అబద్దాలతో కూడిన ప్రకటనలు ట్రంప్ చేస్తున్నారని అన్నారు. ఇరాన్‌లో పాలన మారలేదని స్పష్టం చేసింది. మసూద్ పెజెష్కీయాన్ అధ్యక్షుడిగా ఉన్నారని, అమెరికా వద్దకు ఎలాంటి సీజ్‌ఫైర్ అభ్యర్థనలు పంపలేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా అధ్యక్షుడిని మార్చలేరని ఎద్దేవా చేశారు. ట్రంప్ ఏప్రిల్ ఫూల్ జోకులు వేస్తున్నారని సెటైర్లు వేశారు. ఎన్ని రోజులైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామన వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఆరు నెలలపాటు యుద్ధం చేసే శక్తి వనరులు ఉన్నాయని స్పష్టం చేశారు.
బ్రిటన్ కీలక ప్రతిపాదన
ఇరాన్, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ హోర్మూజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని కిర్ స్టార్మర్ హోర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు 35 దేశాలతో కలిసి ఒక అంతర్జాతీయ దౌత్య సదస్సును నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఇప్పటికే ఈ ఒప్పందంపై సంతకం చేశాయి.సముద్రయాన భద్రతను పునరుద్ధరించడం, చిక్కుకుపోయిన నౌకలను, నావికులను సురక్షితంగా బయటకు తీసుకురావడమే ఈ సమావేశ ప్రధాన ఉద్దేశమని స్టార్మర్ తెలిపారు. ఈ సమావేశానికి మిలిటరీ ప్లానర్లను కూడా ఆహ్వానించారు.
ఈ సంక్షోభం అమెరికా, దాని పాత మిత్ర దేశాల మధ్య విభేదాలను బయటపెట్టింది. ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల్లో బ్రిటన్, ఫ్రాన్స్, వంటి దేశాలు నేరుగా పాల్గొనకపోవడంపై ట్రంప్ తప్పుపడుతున్నారు. మీర సొంత చమురు కోసం మీరే పోరాడటం నేర్చుకోండని సెటైర్లు వేస్తున్నారు. ఇకపై అమెరికా ఎలాంటి సాయం చేయబోదని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్పందించిన బ్రిటన్ వంటి దేశాలు తమక ప్రయోజనాల కోసం తాము పని చేస్తామని అమెరికా లాంటి దేశాల ఒత్తిడితో ఎలాంటి చర్యలు తీసుకోమని స్టార్మర్ స్పష్టం చేశారు.
