Iran President Helicopter Makes Hard Landing | టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇబ్రహీం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కుప్పకూలినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. రాజధాని టెహ్రాన్‌కు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో అజర్‌బైజాన్ సరిహద్దులో ప్రమాదం జరిగింది. తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌ లోని జోల్ఫా నగరానికి సమీపంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ అయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. 


ప్రతికూల వాతావరణమే కారణమా!
ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌తో పాటు కాన్వాయ్‌లో మరో రెండు హెలికాప్టర్లు ఉన్నాయి. ఆ హెలికాప్టర్లలో అధ్యక్షుడు ఇబ్రహీంతో పాటు విదేశాంగశాఖ మంత్రి హోసేన్‌ అమిర్ అబ్దోల్లాహియన్‌, తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌, వెంట పలువురు అధికారులు ప్రయాణిస్తున్నారు. హెలికాప్టర్ కూలినట్లు సమాచారం అందగానే రెస్క్యూ టీమ్స్ అక్కడికి బయలుదేరాయి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో భారీ ఈదురు గాలులతో వర్షం కురుస్తోంది. దాంతో అధ్యక్షుడి హెలికాప్టర్ జాడ వెతికేందుకు ఆటకం ఏర్పడింది.






ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన హెలికాప్టర్ కోసం 40 ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ రిలీఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ జాడ కోసం 40 ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ రిలీఫ్ బృందాలు గాలింపులో పాల్గొన్నాయని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ అధిపతి బెర్హోస్సేన్ కోలియోండ్ తెలిపారు. పొగ మంచు, వర్షాలతో ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు చర్యలకి అవాంతరం ఏర్పడింది. వాతావరణం కారణంగా శోధన  చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, హెలికాప్టరు, చాపర్ లాంటివి కాకుండా రోడ్డు మార్గంలో రెస్క్యూ టీమ్ వెళ్ళిందన్నారు.






ప్రధాని మోదీ ఏమన్నారంటే.. 
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై  విచారం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు క్షేమంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమయంలో ఇరాన్ ప్రజలకు మనం మద్దతుగా ఉండాలన్నారు.






ఇరాన్‌లో ఎమర్జెన్సీ! 
ఇరాన్ ప్రెసిడెంట్ రాజకీయ హత్యకు గురయ్యారని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు ఆయన వెంట ఉన్న విదేశాంగశాఖ మంత్రి మృతిచెందారని, ఏ క్షణంలోనైనా అధికారిక ప్రకటన విడుదల కానుందని ఎన్‌బీసీ రిపోర్ట్ చేసింది. ఇరాన్‌ దేశంలో ఎమర్జెన్సీ విధించినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ఇస్తున్నాయి.