Iran War: మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముదురుతున్నాయి. ఇరాన్ తన దేశంపై అమెరికా గ్రౌండ్ వార్‌కు దిగితే గట్టిగా బుద్ది చెప్పేందుకు ఏకంగా 10 లక్షల మందికిపైగా యోధులను రంగంలోకి దించుతోంది. ఇరాన్ అధికార వార్తా సంస్థ తస్నిమ్‌ కథనం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న బాసిజ్‌ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌, సైనిక నియామక కేంద్రాలకు యువకులు పోటెత్తుతున్నారు. అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంపై అడుగు పెడితే వారికి చారిత్రక నరకాన్ని చూపిస్తామని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 

ఇప్పటికే సరిహద్దుల్లో మోహించిన వేలాది మంది అమెరికన్ మెరైన్లకు తోడుగా, అమెరికాకు చెందిన అత్యంత శక్తిమంతమైన 82వ ఎయిర్‌ బోర్ల్‌ డివిజన్‌ కూడా కొద్ది రోజుల్లోనే మధ్య ప్రాచ్యానికి చేరుకోనుంది. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం అనివార్యం అనిపిస్తోంది. 

ఆయుధ నిల్వలపై అమెరికా ఆందోళన 

యుద్దం మొదలైన నెల రోజులు గడుస్తున్న వేళ అమెరికాకు కొత్త చిక్కులు ఎదురువుతున్నాయి. ది టెలిగ్రాఫ్‌ నివేదిక ప్రకారం, అమెరికా వద్ద ఉన్న ఆధునిక ఆయుధాల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా దాని మిత్ర దేశాలు 11000 వేల క్షిపణులు, బాంబులు ఉపయోగించాయి. దీని కోసం దాదాపు 26 బిలియన్ డాలర్లు అంటే 2.15 లక్షల కోట్లు ఖర్చు చేశారు. 

పాత పద్ధతికి వెళ్తున్న అమెరికా

ఆధునిక ఆయుధాల కొరత కారణంగా అమెరికా సైన్యం ఇప్పుడు పాత కాలపు డమ్‌ బాంబ్స్‌ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవి కచ్చితత్వంతో లక్ష్యాలను తాకలేవు. సాధారణంగా తక్కువ బడ్జెట్‌ ఉన్న దేశాలు వీటిని ఉపయోగిస్తాయి. ఇరాన్ వంటి శక్తిమంతమైన దేశంతో యుద్దం చేస్తున్న సమయంలో ఇలాంటి ఆయుధాలు కొరత అమెరికా వ్యూహాలను దెబ్బ తీసే అవకాశం ఉంది. 

ట్రంప్ వెల్లడించిన రహస్య కానుక

ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ తమకు ఒక మిస్టీరియస్ బహుమతి పంపిందని ఆయన పేర్కొన్నారు. వైట్ హౌస్ క్యాబినెట్‌ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. ఇరాన్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి అమెరికాకు 10 భారీ ఓడల చమురును పంపిందని తెలిపారు. 

మొదట 8 షిప్‌లు పంపిస్తామని చెప్పిన ఇరాన్, తాము చేసిన కొన్ని వ్యాఖ్యలకు క్షమాపణగా అదనంగా మరో 2 కలిపి మొత్తం పది పంపారని వివరించారు. ఇవి పాకిస్తాన్ జెండాలతో ఉన్న ఓడలని ఆయన పేర్కొన్నారు. 

ఈ యుద్ధం కేవలం ఇరు దేశాల మధ్య పోరు మాత్రమే కాదు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హుర్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధించే ప్రయత్నం కూడా. అమెరికా లేదా ఇజ్రాయెల్‌ సైన్యంతో సంబంధం ఉందని భావించే ఓడలను ఇరాన్ ఈ మార్గంలో అడ్డుకుంటోంది. ఇది అంతర్జాతీయ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

మరోవైపు బహిరంగంగా ఇరు దేశాలు కత్తులు దూస్తున్నా, తెర వెనుక పాకిస్తాన్ ద్వారా రాయబారాలు సాగుతున్నాయి. పాకిస్తాన్ అగ్రశ్రేణి దౌత్యవేత్త ద్వారా పరోక్ష చర్చలు జరుగుతున్నప్పటికీ, రెండు దేశాలు ఒకరి ప్రతిపాదనలను మరొకరు తిరస్కరిస్తూనే ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. అమెరికా తన దృష్టిని మధ్య ప్రాచ్యంపై కేంద్రీకరించడం వల్ల రష్యా, చైనాలకు వ్యతిరేకంగా ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థల్లో లోపాలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.