Iran-Israel War : మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ మొదలైన ఘర్షణలు తీవ్రస్థాయికి వెళ్తున్నాయి.  రెండు వైపులా దాడులు జరుగుతున్నాయి, సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధం మరింత ముదిరితే భారత్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 


ప్రస్తుతానికి, ఈ ఘర్షణల వల్ల భారత్‌పై పెద్దగా ప్రభావం పడలేదు, కానీ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే లేదా ఇతర దేశాలు కూడా ఇందులో పాల్గొంటే పరిస్థితులు మారవచ్చు. ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి, తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.


అత్యంత ముఖ్యమైన ప్రభావం, చమురు ధరలు పెరగవచ్చు


ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమైతే, భారత్‌పై ముందుగా  చమురు ప్రభావం పడుతుంది. వీటి ధరల ద్వారా ప్రభావితం అవుతుంది. భారత్ తన అవసరాలలో దాదాపు 85 శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది. చమురు ధర పెరిగితే, సామాన్య ప్రజలకు పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.


అంతేకాకుండా, 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూసివేస్తే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇరాక్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు, ఈ కీలకమైన సముద్ర మార్గం మూసివేస్తే, చమురు ధరలు బ్యారెల్‌కు 200 నుంచి 300 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారి తీస్తుంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ తన చమురు నిల్వలను సిద్ధం చేసుకోవాలి.


ద్రవ్యోల్బణం పెరుగుతుంది, GDPపై ప్రభావం


చమురు ధర పెరిగితే, ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ఇది ప్రభుత్వ సబ్సిడీల వ్యయాన్ని పెంచుతుంది. సామాన్య ప్రజల జేబులపై ప్రభావం చూపుతుంది. చమురు ధర బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే, దేశ వృద్ధిలో 0.3 శాతం తగ్గుదల ఉండవచ్చునని నిపుణులు అంటున్నారు.


కంపెనీల లాభాలపై కూడా ప్రభావం


IOC, BPCL, HPCL వంటి పెట్రోలియం లేదా దాని అనుబంధ ఉత్పత్తులపై ఆధారపడిన అనేక పెద్ద భారతీయ కంపెనీల ఆదాయం ప్రభావితం కావచ్చు. చమురును ఉత్పత్తి చేసే కంపెనీల ఆదాయం పెరగవచ్చు, కానీ దానిపై కూడా ప్రభుత్వ విధానాల ప్రభావం ఉంటుంది.


విమాన ఛార్జీలు, పెయింట్, రసాయనాలు, వాహనాలపై ప్రభావం


విమానాలలో ఉపయోగించే ఇంధనం కూడా చమురుతో తయారవుతుంది. చమురు ధర పెరిగితే, విమాన టిక్కెట్లు కూడా ఖరీదవుతాయి. పెయింట్ తయారీ కంపెనీలు, రసాయనాలు, ఎరువులు, కార్ల తయారీ కంపెనీలపై కూడా నేరుగా ప్రభావం పడుతుంది. దీనివల్ల అనేక వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.


భారతదేశ వాణిజ్యం ప్రభావితం కావచ్చు


భారత్ ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితోనూ వాణిజ్యం చేస్తుంది. ఘర్షణలు పెరిగితే, ఈ దేశాలకు సరుకులను పంపడం, దిగుమతి చేసుకోవడం కష్టమవుతుంది. నౌకల మార్గాలను మార్చవలసి రావొచ్చు. బీమా ఖర్చులు కూడా పెరగవచ్చు.


మందులు, వస్త్రాల వ్యాపారంపై ప్రభావం


భారత్ మధ్యప్రాచ్య దేశాలకు అనేక మందులను ఎగుమతి చేస్తుంది. పరిస్థితులు విషమిస్తే, అక్కడకు పంపే ఆర్డర్లు నిలిచిపోవచ్చు. గతంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగినప్పుడు, భారతదేశం నుంచి వస్త్రాల ఆర్డర్లు నిలిచిపోయాయి.


భారతీయ కంపెనీలకు ఇజ్రాయెల్‌లో కూడా వ్యాపారం ఉంది


TCS, Wipro, Adani Group, SBI, Sun Pharma , Infosys వంటి అనేక పెద్ద భారతీయ కంపెనీలకు ఇజ్రాయెల్‌లో కార్యాలయాలు ఉన్నాయి. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే, వారి ఉద్యోగులు, వ్యాపారం రెండింటిపై ప్రభావం పడవచ్చు. కొన్ని కంపెనీలు అవసరమైతే తమ కార్యకలాపాలను భారతదేశానికి మార్చడానికి ఇప్పటికే ప్రణాళికలు ప్రారంభించాయి.