US Iran War: ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్లా ఖమేనీ అంత్యక్రియల చివరి రోజున వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ ప్రార్థనలకు నాయకత్వం వహించగా, కొత్త సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ హాజరు కాలేదు. ఇదిలా ఉండగా, ఇరాన్‌లోని పలు నగరాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. బుషెహర్‌లో జరిగిన బాంబు దాడులు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. అయితే తాము కొత్తగా దాడులు చేయలేదని అమెరికా స్పష్టం చేసింది.
బుషెహర్, కొనరాక్, చబహార్, బందర్ అబ్బాస్ నగరాల నుంచి పేలుళ్ల నివేదికలు వెలువడ్డాయని ఇరాన్ మీడియా పేర్కొంది. మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, కొనరాక్‌లో మూడు పేలుళ్లు వినిపించాయి. బుషెహర్ , చోఘడక్ నుంచి కూడా పేలుళ్లు జరిగినట్లు నివేదికలు అందాయి. ఈ పేలుళ్లకు గల కారణం ఇంకా అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.
ఈ పేలుళ్లు దాడి వల్ల, సైనిక చర్య వల్ల, లేక మరేదైనా కారణం వల్ల జరిగాయా అనేది స్పష్టత లేదు. స్థానిక అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ పేలుళ్లకు కారణం ఏంటో ప్రస్తుతం స్పష్టంగా తెలియడం లేదు. ఈ పేలుళ్లకు గల కారణంపై గానీ, జరగబోయే దాడిపై గానీ ఏ పక్షం నుంచి అధికారిక ఎలాంటి ప్రకటన రాలేదు.
ట్రంప్, నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడుకున్నారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో, "ప్రధానమంత్రి నెతన్యాహు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సాయంత్రం మరోసారి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. వివిధ రంగాల్లో తమ దేశాల మధ్య సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించడానికి వారు అంగీకరించారు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు సంబంధించిన ఇటీవలి పరిణామాల గురించి అధ్యక్షుడు ట్రంప్ ప్రధానమంత్రికి వివరించారు" అని పేర్కొంది.
8 మంది ఇరాన్ సైనికులు మృతి
అమెరికా వైమానిక దాడుల్లో ఎనిమిది మంది ఇరాన్ సైనికులు మరణించారు. ఐఆర్‌జిసి అనుబంధ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, నిన్న రాత్రి జరిగిన అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ వైమానిక దళానికి, నావికా దళానికి చెందిన మొత్తం ఎనిమిది మంది సిబ్బంది మరణించారు.
