Iran army completely destroyed: ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగియనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.  యాక్సియోస్‌ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇరాన్‌లో ఇక లక్ష్యంగా చేసుకోవడానికి  ఏమీ మిగలలేదు. వారి సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది. నేను కోరుకుంటే ఈ యుద్ధాన్ని ఇప్పుడే ఆపేయగలను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి చివరి వారం నుండి సాగుతున్న భారీ దాడుల వల్ల ఇరాన్ నాయకత్వంతో పాటు సైనిక వ్యవస్థ కుప్పకూలిందని ట్రంప్ పేర్కొన్నారు.

 హార్ముజ్ జలసంధిలో కీలక విజయం: 

ఈ యుద్ధంలో భాగంగా అమెరికా సైన్యం హార్ముజ్ జలసంధి వద్ద భారీ విజయాన్ని సాధించింది. అంతర్జాతీయ చమురు రవాణాకు ఆటంకం కలిగించేందుకు ఇరాన్ మోహరించిన  16 మైన్ నౌకలను (Mine-laying vessels) అమెరికా దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. దీనివల్ల సముద్ర మార్గంలో ఉన్న ముప్పు తొలగిందని, ఇకపై నౌకల రాకపోకలు నిర్భయంగా సాగవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌కు ఇప్పుడు నౌకాదళమే లేదు, వారందరినీ మేము ముంచేశాం అని ఆయన వ్యాఖ్యానించారు.

చైనాకు ఇరాన్ చమురు ఎగుమతులు 

యుద్ధం జరుగుతున్నప్పటికీ ఇరాన్ తన ఆర్థిక మనుగడ కోసం చైనాకు చమురును అక్రమంగా తరలిస్తూనే ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి సుమారు  11.7 మిలియన్ బారెళ్ల ముడి చమురును ఇరాన్ చైనాకు పంపింది. హార్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఇరాన్ ట్యాంకర్లు రహస్యంగా తమ ఎగుమతులను కొనసాగించడం పట్ల అమెరికా నిఘా వర్గాలు దృష్టి సారించాయి.

ఇజ్రాయెల్ పట్టుదల - ట్రంప్ దౌత్యం                                   

ట్రంప్ యుద్ధం ముగుస్తుందని చెబుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం తన పట్టు వీడటం లేదు. ఇరాన్ అణు కేంద్రాలు, భవిష్యత్తులో ముప్పు కలిగించే వనరులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు అవసరమైనంత కాలం యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం,  తాజా సైనిక ఓటములతో ఇరాన్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా త్వరలోనే  విజయాన్ని ప్రకటించి ఈ యుద్ధానికి ముగింపు పలకాలని చూస్తుండగా, మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతి కోసం ఇజ్రాయెల్ మరిన్ని దాడులకు సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది.