ఇంట‌ర్నెట్ అపోక‌లిప్స్‌.. గత కొద్ది రోజులుగా వార్తల్లో వినిపిస్తున్న పేరు. మన భాషలో చెప్పాలంటే దీని అర్థం  ఇంట‌ర్నెట్ యుగాంతం. అంటే ఇకపై మనకు ఇంట‌ర్నెట్‌ ఉండదన్న మాట. దీనిని ఉపయోగించడం కూడా దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ప్రస్తుత యుగంలో ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని మనం ఊహించగలమా? కానీ ఇది త్వరలోనే జరగబోతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. భూమి వైపు దూసుకొస్తోన్న భారీ సౌర తుపానే దీనికి కారణమని తేలింది. ఇదో అనూహ్య పరిణామమని.. ప్రజల జీవితంపై ప్రభావాన్ని చూపుతుందని పరిశోధన చెబుతోంది. 


పరిశోధన ఏం చెబుతోంది?


కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ సంగీతా అబ్దు జ్యోతి.. సోలార్ సూపర్‌స్టార్మ్‌ల గురించి పరిశోధన నిర్వహించారు. ఈ అధ్యయన వివరాలతో ఇంట‌ర్నెట్ అపోక‌లిప్స్‌ అంశంపై అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ స్పెషల్ ఇంటరెస్ట్ గ్రూప్ ఆన్ డేటా కమ్యూనికేషన్స్ (SIGCOMM) లో ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని ప్రకారం.. భూమిని స‌మీపిస్తున్న సౌర తుపాను వ‌ల్ల ఇంట‌ర్నెట్ యుగాంతం వస్తుందని తెలిపారు. ఇది కచ్చితంగా వస్తుందని చెప్పకపోయినా.. దీనిని ఒక బ్లాక్ఔట్‌గా ఆమె అభివర్ణించారు. ఈ బ్యారీ సౌర తుపాను కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ డ్యామేజ్ అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చరించారు. అది కొద్ది గంటలు లేదా రోజులు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. 


ఇంట‌ర్నెట్‌కు డ్యామేజ్ ఎలాగంటే?..
ఇంట‌ర్నెట్‌కు డ్యామేజ్ అనేది పలు విధాలుగా ఉంటుందని జ్యోతి పేర్కొన్నారు. సౌర తుఫాను వ‌ల్ల స‌ముద్ర గ‌ర్భంలో ఉన్న ఇంట‌ర్నెట్ కేబుల్స్ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. దీని కారణంగా ఇంట‌ర్నెట్‌కు అంత‌రాయం కలుగుతుందని చెప్పారు. సాధారణంగా సౌర తుపానుల వల్ల స‌ముద్ర మ‌ట్టానికి ఎత్తయిన ప్రాంతాలు ప్రభావానికి గురవుతుంటాయని తెలిపారు. ఈ సౌర తుఫాను వ‌ల్ల అట్లాంటిక్, ప‌సిఫిక్ స‌ముద్రాల అంతర్భాగం గుండా వెళ్లే ఇంట‌ర్నెట్ కేబుల్స్ వ్యవస్థ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. జీపీఎస్‌ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కూడా ఉందన్నారు. దీని వల్ల మొత్తం వ్యవస్థ స్థంభించిపోతుందని చెప్పారు. 


ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? తిరిగి యధాస్థితి ఎప్పుడు వస్తుంది? అనే విషయాలపై ఇప్పుడే అంచనాకు రాలేమని జ్యోతి తెలిపారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా కోవిడ్ మహమ్మారి లాంటిదేనని ఆమె అన్నారు. ఇంత పెద్ద విపత్తుని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమాజం సిద్ధంగా లేదని చెప్పారు. మనం ఊహించినదాని కంటే భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు. 


సాధారణంగా ప్రతి 100 ఏళ్లకు ఒకసారి ఇలాంటి సోలార్ సూపర్ స్టార్మ్‌లు వస్తుంటాయి. ఇవి ప్రపంచంలోని ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తాయి. ఈ సౌరతుపానులు 1859, 1921లో భూమిని తాకాయి. అలాగే 1989లో మోస్తరు తుపాను కూడా సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ తుపానులు వచ్చినప్పుడు రేడియో వ్యవస్థలు పనిచేయవు. 





 Also Read: ఈ గ్రామంలో స్త్రీ, పురుషులకు వేర్వేరు భాషలు.. మరి ఇద్దరు కలిస్తే? వీరు దేవుడు చేసిన మనుషులట!


Also Read: Korea Red Ink: రెడ్ ఇంక్‌, 4వ నెంబరంటే కొరియాకు టెర్రర్.. పందులు కల్లోకి వస్తే పండగే, ఎందుకో తెలుసా?