ఇండోనేసియాలో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 127 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మ్యాచ్‌లో ఓడిన జట్టు అభిమానులు ఆగ్రహంతో మైదానంలోకి రావడంతో ఈ హింస చెలరేగింది. ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లోని అరెమా ఎఫ్‌సి, పెర్సెబయా సురబయా మధ్య ఈ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. అరెమా ఎఫ్‌సీ ఓడిపోవడం చూసి ఆ జట్టుకు మద్దతు తెలిపిన అభిమానులు తట్టుకోలేకపోయారు.
ఆ భారీ జనాన్ని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ను కూడా పోలీసులు ప్రయోగించారు. దీంతో స్టేడియంలో మరింత తొక్కిసలాట జరిగింది. AFP వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, తూర్పు జావా ప్రావిన్స్ పోలీసు చీఫ్, నికో అఫింటా మాట్లాడుతూ.. మ్యాచ్‌లో తమ జట్టు ఓడిపోవడాన్ని చూసి కొంతమంది ఫుట్‌బాల్ పిచ్ వైపు పరుగులు తీశారని, వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పరిస్థితి మొత్తం అదుపుతప్పిందని అన్నారు.
‘‘స్టేడియంలో గొడవ, గందరగోళం నెలకొంది. 34 మంది స్టేడియంలో మరణించగా, మిగిలిన వారు ఆసుపత్రిలో మరణించారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.’’ అని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
ఘటన పైన ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (PSSI) శనివారం (అక్టోబరు 1) అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. మొత్తం విషయాన్ని దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని మలంగ్‌కు పంపినట్లు తెలిపింది. ఆ ప్రకటన ప్రకారం, ‘‘కంజ్రుహాన్ స్టేడియంలో అరేమా జట్టు అభిమానులు చేసిన దానికి PSSI చింతిస్తుంది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నాం. PSSI వెంటనే దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. అది మలంగ్‌కు బయలుదేరింది. అల్లర్ల దృష్ట్యా ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌లను వారం రోజుల పాటు వాయిదా వేశారు. ఈ ఘటనలో 180 మంది గాయపడినట్లు సమాచారం. ఈ సీజన్‌లో అరేమా ఎఫ్‌సీపై నిషేధం విధించారు.