భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తామే మధ్యవర్తిత్వం చేశామని, తనకు చాలా గర్వంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రకటన చేయడం తెలిసిందే. అయితే పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారతదేశం దాడి చేయడంతో అమెరికా వేగంగా స్పందించి ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వ ప్రయత్నాలను వేగవంతం చేసిందని ఓ నివేదికలో వెల్లడైంది.
నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద భారత్ దాడి
పాక్‌లోని మూడు వైమానిక స్థావరాలపై భారత ఆర్మీ దాడి చేయగా.. అందులో రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై జరిగిన క్షిపణి, డ్రోన్ దాడి పాకిస్తాన్ సైన్యాన్ని వణికించింది. ఈ స్థావరం పాకిస్తాన్ సైన్యానికి ట్రాన్స్‌పోర్ట్ హబ్ లాంటిది. ఈ నూర్ ఖాన్ వైమానిక కేంద్రం ఇస్లామాబాద్ నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోపే ఉంటుంది. పైగా పాక్ సైనిక ప్రధాన కార్యాలయానికి పక్కనే ఉంటుంది. నూర్ ఖాన్ వైమానిక కేంద్రం బెనజీర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో ఉంటుందని తెలిసిందే. పాకిస్తాన్ జాతీయ అంతరిక్ష కేంద్రానికి సైతం సమీపంలో ఉన్న కారణాలతో నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై భారత్ దాడి చేయగానే డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వ చర్యలు ముమ్మరం చేసి కాల్పుల విరమణకు ఇరుదేశాలను ఒప్పించగలిగారు.
రావల్ఫిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై క్షిపణి, డ్రోన్ అటాక్ తో భారీ పేలుడు జరిగింది. పేలుడు తర్వాత మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మొదట డ్రోన్ దాడి జరిగింది. ఆ వెంటనే క్షిపణి దాడి జరిగి మంటలు ఎగసిపడ్డాయని అన్నారు. పాకిస్తాన్ బలగాలు వెంటనే నూర్ ఖాన ఎయిర బేస్‌ను మూసివేసి అటువైపు ప్రజలుగానీ, మీడియాగానీ రాకుండా జాగ్రత్త పడ్డాయి.
గాల్లోనే ఇంధనం నింపుకునే వీలున్న ఎయిర్ బేస్
పాకిస్తాన్ యుద్ధ విమానాలను గాల్లోనే నిలుపుకుని ఇంధనం నింపే సామర్థ్యం నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు మాత్రమే ఉంది. పాక్ అణ్వాయుధాలను పర్యవేక్షించే పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రణాళికల విభాగం ప్రధాన కార్యాలయానికి నూర్ ఖాన్ బేస్ అతి సమీపంలో ఉంది. ఒక అమెరికా అధికారి ది న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. న్యూక్లియర్ కమాండ్ అథారిటీకి ఏమైనా సమస్య తలెత్తుతుందని పాక్ భయాందోళనకు గురైంది. భారత్ ఏమైనా చేయగలదు, దేన్నైనా ధ్వంసం చేస్తుందని ఈ దాడి నిరూపించిందన్నారు.
పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అణ్వాయుధాలను ఎలా, ఎప్పుడు ఉపయోగించాలో డిసైడ్ చేసే నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారని పాక్ మీడియా నివేదికలను స్పష్టం చేసింది. పాక్ లోని మిగతా ఎయిర్ బేస్‌లపై సైతం భారత్ విరుచుకుపడి సర్వనాశనం చేసే అవకాశం ఉందని భావించి అమెరికా అప్రమత్తమైంది. భారత్, పాక్ ప్రధానులు, విదేశాంగ శాఖ, ఆర్మీ ఉన్నతాధుకారులతో చర్చించి కాల్పుల విరమణకు ఒత్తిడి చేసిందని తెలుస్తోంది.
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. నిరంతర దాడులకు ప్రత్యామ్నాయాల వైపు చూడాలని జేడీ వాన్స్ ప్రధాని మోదీని కోరగా.. ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదని నివేదిక పేర్కొంది.