భారతదేశం పాకిస్తాన్‌లో బ్రహ్మోస్ దాడి: భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో బలగాలు తమ టార్గెట్స్‌ను ఏ తప్పిదం లేకుండా ఛేదించాయి. అది కూడా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో దాడులు జరిపి 9 ఉగ్రవాద స్థావరాలను తునా తునకలు చేశాయి. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం వెల్లడించారు.

మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత 9 ఉగ్రవాద కేంద్రాలపై జరిపిన దాడి విజయవంతంగా పూర్తి కావడంతో ఆపరేషన్ సిందూర్ లో భారత బలగాలు ఏ ఆయుధాలను, ఏ క్షిపణులను వాడారు, ఏ టెక్నాలజీ వినియోగించారని చర్చ జరుగుతోంది. భారత్, పాక్ దేశాలు కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత ఓ సంచలన నివేదిక వెలుగుచూసింది. ఆపరేషన్ సిందూర్ లో భారత బలగాలు బ్రహ్మోస్ మిస్సైల్ వినియోగించారని శనివారం విడుదలైన ఓ రిపోర్టులో ఉంది. పాకిస్తాన్ సైతం భారత్ ముమ్మాటికీ బ్రహ్మోస్ క్షిపణులను తమపై దాడికి వినియోగించిందని ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగా పాకిస్తానే ఆ రిపోర్టులు రిలీజ్ చేసిందని భారత్ భావిస్తోంది.

భారత బలగాలు బ్రహ్మోస్ మిస్సైల్స్ వాడటం ద్వారా లక్ష్యాలను వందకు శాతం ఛేదించాయని పాకిస్తాన్ విదేశాంగ ఓ ప్రకటనలో పేర్కొంది. హామర్ అనే గగనతతం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించే మిస్సైల్ వినియోగించినట్లు రిపోర్టులు వచ్చాయి. దాంతో పాటు స్కాల్ప్ అనే లాంగ్ రేంజ్ గగనతల క్రూయిజ్ మిస్సైల్ వాడి ఉగ్రవాదుల శిబిరాలలో పాక్ లోని కొన్ని టార్గెట్స్ ఛేదించారని ప్రచారం జరిగింది. భారత వైమానికి దళాలు రాఫెల్ ఫైటర్ జెట్స్ నుంచి హామర్, స్కాల్ప్ మిస్సైల్స్‌ను విజయవంతంగా ప్రయోగించి ఉంటాయని మరికొన్ని రిపోర్టులు ఉన్నాయి. బ్రహ్మోస్ అనేది లాంగ్ రేంజ్ లక్ష్యాలు ఛేదించగల క్రూయిజ్ మిస్సైల్. యుద్ధ విమానాల నుంచి దీనిని భూ ఉపరితలం, గగనతలం, నీళ్లలోనూ ప్రయోగించే అవకాశం ఉంది.

భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో దాడులకు దిగినందునే తాము యూనైటెడ్ నేషన్స్ ఛాప్టర్ ఆర్టికల్ 51 ప్రకారం ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేశామని పాకిస్తాన్ వాదిస్తోంది. ఆ కారణంగానే పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో భారత్ నగరాలపై దాడులు చేయాల్సి వచ్చిందని వితండవాదం చేస్తోంది. 

బ్రహ్మోస్ క్షిపణులపై భారత్ ఏమంటోంది..ఆపరేషన్ సిందూర్ లో భాగంగా బ్రహ్మోస్ మిస్సైల్స్ వినియోగించినట్లు భారత్ ఎలాంటి ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ చేసిన ఆరోపణలపై భారత్ స్పందించలేదు. తమ వద్ద ఉన్న అత్యాధునిక మిస్సైల్స్ అవసరం లేకుండానే పాక్, పీఓకేలోని టెర్రరిస్ట్ క్యాంపులను టార్గెట్ చేసి లేపేసామని మాత్రం భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. 

భారత్ మాత్రం ఎస్400 ద్వారా, ఆకాష్ ద్వారా పాక్ చేసిన దాడులను విజయవంతంగా ఎదుర్కొంది. ఇదే విషయాన్ని భారత బలగాలు చెబుతున్నాయి. ఎస్400 సుదర్శన చక్రంలా సరిహద్దులో పాక్ డ్రోన్లు, మిస్సైల్స్, ఫైటర్ జెట్ల పని పట్టిందని తెలిసిందే.

అసలేంటీ బ్రహ్మోస్..బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశం, రష్యా కలిసి రూపొందించాయి. దీని పరిధి 700 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బ్రహ్మోస్ ఇప్పటివరకు ఎప్పుడూ విఫలం కాలేదు. ఆ మిస్సైల్‌కు భారతదేశంలోని ‘బ్రహ్మపుత్ర నది’ పేరు, రష్యా ‘మాస్కో’ ను కలిపి ‘బ్రహ్మోస్’ గా పేరు పెట్టారు. ఈ మిస్సైల్ కోసం భారతీయ కంపెనీ పాత్ర 51 శాతం ఉండగా, రష్యా కంపెనీ 49 శాతం పాత్ర పోషించింది. దీనికి మేనేజింగ్ డైరెక్టర్ భారతీయుడు కాగా, రెండో అధికారి రష్యాకు చెందినవారని సమాచారం.

పాక్ వరుస డ్రోన్ దాడులు, కాల్పులకు పాల్పడటంతో భారత బలగాలు రావల్ఫిండిలోని నౌర్ ఖాన్ ఎయిర్‌ఫోర్స్ బేస్ మీద, పంజాబ్ లోని షిర్కోట్ రఫీఖి ఎయిర్‌బేస్, పంజాబ్ ఛక్వాల్ లోని మురీద్ ఎయిర్‌బేస్ క్యాంప్ మీద భారత బలగాలు అటాక్ చేసి తమ సత్తా చూపాయి. వాటితో పాటు స్కర్దు, బోలారి, జాకోబాబాద్, సర్గోధాలోని ఎయిర్ బేస్‌లు సైతం ధ్వంసమయ్యాయని సమాచారం. తమ దేశంలో ఉగ్రదాడులు చేయనంత వరకే శాంతి మంత్రాన్ని జపిస్తామని, పాక్ హద్దు మీరితే భారత బలగాలు బుద్ధి చెబుతాయని హెచ్చరించారు.