Who is Balaji Srinivasan: ఇండియా నుంచి పారిపోయి ప్రత్యేకదేశం ఏర్పాటు చేసుకున్నట్లుగా హడావుడి చేస్తున్న నిత్యానంద గురించి మనకు తెలుసు. ఆయన దేశం ఎక్కడుందో మనకు తెలియదు. కానీ "బాలాజీ శ్రీనివాసన్ " ఏర్పాటు చేసిన కొత్త ప్రత్యేక దేశం మాత్రం అందరికీ తెలిసిపోయిదంి. సింగపూర్ సమీపంలో ద్వీపంలో కొత్త టెక్ దేశాన్ని భారత సంతతి వ్యాపారవేత్త బాలాజీ శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, టెక్ విజనరీ బాలాజీ శ్రీనివాసన్ "నెట్‌వర్క్ స్టేట్" ప్రాజెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
బాలాజీ శ్రీనివాసన్ ఒక భారత సంతతి అమెరికన్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో BS, MS, PhD చేశారు. అతను Coinbaseలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేశాడు. తర్వతా Counsyl Earn.com, Teleport, Coin Centre వంటి స్టార్టప్‌లను స్నేహితులతో కలిసి ప్రారంభించాడు. Andreessen Horowitz (a16z) వద్ద జనరల్ పార్టనర్‌గా పనిచేశాడు. Bitcoin, Ethereum, OpenSea, Alchemy వంటి టెక్ , క్రిప్టో ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు.
The Network State: How to Start a New Country అనే పుస్తకం రాశారు. "నెట్‌వర్క్ స్టేట్" అనే భావనను ఈ పుస్తకంలో ప్రతిపాదించారు. ఇది ఒక డిజిటల్-ఫస్ట్, డిసెంట్రలైజ్డ్ సమాజం. ఇది ఆన్‌లైన్ కమ్యూనిటీగా ప్రారంభమై, క్రమంగా భౌతిక భూమిని సంపాదించి, చివరికి స్థాపిత దేశాల నుండి దౌత్యపరమైన గుర్తింపు పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమాజం సాంకేతికత, క్రిప్టోకరెన్సీ, వ్యక్తిగత స్వేచ్ఛ, మరియు ఆవిష్కరణల చుట్టూ ఏర్పడిన భాగస్వామ్య విలువలపై ఆధారపడుతుందని బాలాజీ శ్రీనివాసన్ చెబుతున్నారు.
సింగపూర్ సమీపంలో ఒక ప్రైవేట్ ద్వీపాన్ని బాలాజీ కొనుగోలు చేశారు. "నెట్‌వర్క్ స్కూల్" అనే మూడు నెలల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాడు. స్టార్టప్ స్థాపకులు, టెక్ ఇన్నోవేటర్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం దీన్ని రూపొందించారు. ఇది AI, బ్లాక్‌చైన్, స్టార్టప్‌ల వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది. జిమ్ సెషన్‌లు , సహకార ప్రాజెక్టులను కలిగి ఉంటుంది. బిట్‌కాయిన్ శక్తి ద్వారా, మేము సింగపూర్ సమీపంలో ఒక అందమైన ద్వీపాన్ని సంపాదించాము, అక్కడ మేము నెట్‌వర్క్ స్కూల్‌ను నిర్మిస్తున్నామని బాలాజీ శ్రీనివాసన్ ప్రకటించారు. నెట్ వర్క్ స్కూల్ ప్రోగ్రామ్ కోసం 8 దేశాల నుండి 4,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి, కానీ కేవలం 128 మందికి మాత్రమే అవకాశం కల్పించారు.
స్టార్టప్ స్థాపకులు , జిమ్ ఔత్సాహికుల కోసం ఒక ఒయాసిస్ నెట్ వర్క్ స్కూల్ ని చెబుతున్నారు. ఇక్కడ రిమోట్ వర్కర్లు, డిజిటల్ నోమాడ్‌లు, కంటెంట్ క్రియేటర్లు, టెక్నాలజిస్ట్‌లు కలిసి సాంకేతికతను నేర్చుకోవడం, క్రిప్టోలో సంపాదించడం, ఫిట్‌నెస్‌ను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.నెట్‌వర్క్ స్కూల్ ఒక "విన్-అండ్-హెల్ప్-విన్" కమ్యూనిటీని ప్రోత్సహిస్తుంది, ఇది సత్యం, ఆరోగ్యం, సంపద విలువలపై ఆధారపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే Ethereum సహ-స్థాపకుడు విటాలిక్ బుటెరిన్, వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ వంటి ప్రముఖ వ్యక్తుల నుండి ప్రశంసలు అందుకుంది.