Imran Khan: పాక్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తోషాఖానా అవినీతి కేసులో తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ కు ట్రయల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ అవినీతి కేసులో తనపై పడ్డ శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఇమ్రాన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ఇస్లామాబాద్ హైకోర్టు బెంచ్.. నిన్న (ఆగస్టు 28వ తేదీన) తీర్పును రిజర్వ్ చేయగా.. హైకోర్టు చీఫ్ జడ్జి జస్టిస్ అమిర్ షారూఖ్, జస్టిస్ తారీఖ్ మహ్మద్ జహంగిరిలతో కూడా హైకోర్టు బెంచ్.. ఇవాళ (ఆగస్టు 29వ తేదీ) ఆ తీర్పును ప్రకటించింది. ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 


కాగా, ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులు, సంస్థలు, దేశాలు బహుమతులను ఇచ్చాయి. అయితే ఆయా బహుమతులను ఇమ్రాన్ ఖాన్ తోషాఖానా నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి వాటిని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై గతంలో కేసు కూడా నమోదు అయింది. ఈ కేసుపై విచారణ జరిపించిన ఇస్లామాబాద్ లోని జిల్లా, సెషన్స్ కోర్టు ఆగస్టు 5వ తేదీన మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. అంతే కాకుండా 5 సంవత్సరాల పాటు ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. సెషన్స్ కోర్టు తీర్పు విడుదల చేసిన వెంటనే పోలీసులు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన పంజాబ్ ప్రావిన్స్ లోని అటక్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రయల్ కోర్టు తీర్పును ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ సవాల్ చేశారు. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టు వాదనలు విని హైకోర్టు వేసిన మూడేళ్ల జైలు శిక్షను నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


Also Read: Aditya-L1: సూర్యుడిపై నిఘా కోసమే ఆదిత్య-ఎల్1, మానవాళికి ముప్పు తప్పించేందుకేనంటున్న ఇస్రో!


ఇమ్రాన్‌ను ప్రధాని చేసి తప్పు చేశానన్న మియందాద్


పాకిస్తాన్ బ్యాటింగ్ దిగ్గజం జావేద్ మియందాద్,  తాను క్రికెట్ ఆడినప్పుడు తనకు సారథిగా వ్యవహరించిన పాక్ లెజెండరీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై  సంచలన ఆరోపణలు చేశాడు.  ఇమ్రాన్ ను  ప్రధాని చేసి తాను తప్పు చేశానని వాపోయాడు. ఇమ్రాన్ లో  కృతజ్ఞతాభావం లేదని, కనీసం తనకు థ్యాంక్స్ కూడా చెప్పలేదని  మియాందాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 


పాకిస్తాన్ కు చెందిన ARY Newsకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఇమ్రాన్ ఖాన్ గురించి మియందాద్ మాట్లాడుతూ.. ‘నేను ఈరోజు మీకు అసలు విషయం చెబుతున్నా. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడానికి నేను ఎంతగానో సాయం చేశాను. అతడి ప్రమాణ  స్వీకారోత్సవానికి కూడా హాజరయ్యా. కానీ ఆ తర్వాత   ఇమ్రాన్ నాకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అది నాకు చాలా బాధ కలిగించింది.  ఇమ్రాన్ కోసం అంత చేసినా నాకు అతడు  థ్యాంక్స్ కూడా చెప్పకపోవడం ఏదోలా అనిపించింది. మనం ఒక వ్యక్తికి సాయం చేసినప్పుడు తిరిగి వారిమీద  కృతజ్ఞత చూపించడం కనీస బాధ్యత. అది లేనప్పుడు రాత్రి 2 గంటలకు వచ్చి నా తలుపు ఎందుకు కొట్టినట్టు..? నన్ను సాయం ఎందుకు అడిగినట్టు..?‘ అని మియందాద్ అన్నాడు.