America attacks Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు వెలువడుతున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్‌లో కొనసాగుతున్న అంతర్గత నిరసనలు, ఆందోళనకారులపై ప్రభుత్వం చేస్తున్న అణచివేతను కారణంగా చూపిస్తూ, ట్రంప్ Help is on the way అని ప్రకటించడం యుద్ధ మేఘాలను కమ్మేలా చేసింది. ఒకవేళ అమెరికా నిజంగా దాడికి దిగితే, దాని పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి.
అమెరికాపై ఇరాన్ దాడి ముప్పు
అమెరికా దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఇరాన్ తన వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి వ్యవస్థతో పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను ముఖ్యంగా ఖతార్, యూఏఈలలోనివి లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్‌పై కూడా ఇరాన్ విరుచుకుపడవచ్చు. అమెరికా ప్రధాన భూభాగంపై నేరుగా దాడి చేసే సామర్థ్యం ఇరాన్‌కు పరిమితమే అయినా, సైబర్ దాడుల ద్వారా అమెరికా బ్యాంకింగ్, పవర్ గ్రిడ్ వ్యవస్థలను స్తంభింపజేసే ప్రమాదం ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, హిజ్బుల్లా వంటి గ్రూపులు కూడా అమెరికా ప్రయోజనాలపై దాడులకు దిగవచ్చు.
అంతర్జాతీయ ముడిచమురు సంక్షోభం
యుద్ధం మొదలైతే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయవచ్చు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇది జరిగితే ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి . దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తాయి. ఫలితంగా అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉంది.
మిత్రదేశాల వైఖరి
అమెరికా దాడి చేస్తే బ్రిటన్ వంటి కొన్ని దేశాలు మద్దతు తెలిపే అవకాశం ఉన్నప్పటికీ, సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులు తమపై జరుగుతాయని అవి భయపడుతున్నాయి. అందుకే అవి ఈ ఘర్షణకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, రష్యా , చైనాలు అమెరికా చర్యను తీవ్రంగా వ్యతిరేకించవచ్చు, ఇది ప్రపంచాన్ని రెండు ధృవాలుగా విడగొట్టే మూడో ప్రపంచ యుద్ధం వంటి పరిస్థితులకు దారితీయవచ్చునన్న ఆందోళన ఉంది.
భారత్‌పై ప్రభావం ఎంత?
భారత్‌పై ఈ యుద్ధ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. భారత్ తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతి చేసుకుంటుంది. ధరలు పెరిగితే దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25% అదనపు సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇది భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు. యుద్ధం వ్యాపిస్తే వారి భద్రత , ఉపాధి పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. మొత్తంమీద, ఇరాన్‌పై అమెరికా దాడి అనేది కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, మధ్యప్రాచ్యంలో ఏళ్ల తరబడి కొనసాగే అశాంతికి దారితీస్తుంది.